Chief Minister: ఆ విషయంలో అస్సలు రాజీపడే ప్రసక్తే లేదు...
ABN , First Publish Date - 2023-08-24T11:35:38+05:30 IST
రాష్ట్రానికి సంబంధించిన జలాల విషయంలో రాజీ పడేదిలేదని నీరు, నేల, సరిహద్దు రక్షణ, ప్రజల సంక్షేమమే లక్ష్యమని
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి సంబంధించిన జలాల విషయంలో రాజీ పడేదిలేదని నీరు, నేల, సరిహద్దు రక్షణ, ప్రజల సంక్షేమమే లక్ష్యమని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) పేర్కొన్నారు. కావేరి జలాల విషయంలో తమిళనాడు(Tamil Nadu) ప్రభుత్వ ఒత్తిడిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బుధవారం విధానసౌధలో జరిగిన సమావేశానికి ఆరుగురు మాజీ సీఎంలతోపాటు రాష్ట్రానికి చెందిన ఎంపీలు పాల్గొన్నారు. రాష్ట్రంలో జలవనరుల సమస్యలను ఆ శాఖను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) ప్రస్తావించారు. కేఆర్‌ఎస్ డ్యామ్ నుంచి కావేరి నీరు విడుదల విషయంలో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో విడుదల చేయాల్సి వచ్చిందని తెలిపారు. మహదాయి, మేకెదాటు ప్రాజెక్టుల ప్రగతిని వివరించారు. అన్ని ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. కావేరి(Kaveri) నీటిపై తరచూ తమిళనాడు లేవనెత్తే వివాదాలకు కేంద్రం, న్యాయస్థానం ద్వారానే శాశ్వత పరిష్కారం కావాల్సి ఉందని తెలిపారు. సుదీర్ఘ సమయం పాటు జరిగిన అఖిలపక్ష భేటీలో కావేరీ జలాలతో పాటు మహదాయి, మేకెదాటు అంశాలపైనా చర్చించారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ ఐదారేళ్లకోసారి వర్షంలోటు ఏర్పడినప్పుడే వివాదం తీవ్రమవుతుందన్నారు. కావేరికి అనుబంధమైన జలాశయాలు పూర్తిగా నిండలేదని తమిళనాడు కోటాకు అనుగుణంగా విడుదల చేయాలని కోర్టుల ద్వారా ఒత్తిడి తెస్తోందన్నారు. సుప్రీం కోర్టులో తమిళనాడు ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసిందని, ఆ తర్వాత ట్రిబ్యునల్ సూచనలు పాటించాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రం తరపున న్యాయవాదులు సమగ్రంగా వాదనలు వినిపిస్తున్నారన్నారు. ఖరీఫ్ ప్రారంభమైనప్పటి నుంచి కోటా మేరకు 86.38 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉండేదని, కానీ 24 టీఎంసీలు మాత్రమే విడుదల చేశామన్నారు. తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో రాష్ట్రం తరపున కూడా పిటీషన్ వేశామన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న వివాదాలు ఇతర రాష్ట్రాలతో సంబంధం ఉన్నందున ప్రధానమంత్రి నరేంద్రమోదీ వద్దకు అఖిలపక్షంతో వెళ్లాలని తీర్మానించామన్నారు. కావేరి నదికి అనుబంధంగా కనకపుర వద్ద మేకెదాటు నిర్మిస్తే తమిళనాడుకు నష్టం లేదన్నారు.
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మద్దతు: కుమారస్వామి
కావేరి, మహదాయి జల వివాదాల్లో రాష్ట్ర ప్రజల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మద్దతు ఇస్తామని జేడీఎస్ నేత కుమారస్వామి తెలిపారు. మూడు నాలుగేళ్లుగా మంచి వర్షాలు కురిశాయని, అప్పట్లో సమస్య తలెత్తలేదన్నారు. ఈ ఏడాది సాధ్యం కాకపోవడంతో వివాదం తీవ్రమైందన్నారు. కావేరి పరిధిలోని రైతులకు నీరు విడుదల చేయకుండా, తమిళనాడుకు క్యూసెక్కులు పెంచడం సరికాదన్నారు. ప్రజల జీవనానికి అవసరమైన గ్యారెంటీని ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నీరు విడుదల చేశాక అఖిలపక్షమా : యడియూరప్ప ఆగ్రహం
అఖిలపక్ష భేటీ ఆలస్యం చేశారని మాజీ సీఎం, బీజేపీ నేత యడియూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని ముందుగానే నీరు విడుదల చేసి ఇప్పుడు అఖిలపక్షం ఏర్పాటా..? అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటి విడుదలపై మండ్య, రామనగర, మైసూరు జిల్లాల రైతులు తీవ్రస్థాయిలో నిరసనలు చేస్తున్నారన్నారు. కొన్ని రోజుల వ్యవధిలోనే 8 టీఎంసీల నీటిని ధారాదత్తంగా విడుదల చేశారని విచారం వ్యక్తం చేశారు. కాగా రాజకీయ పార్టీల పరంగా నిత్యం విమర్శలు చేసుకునే నేతలు ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్నారు. కుమారస్వామితో డీకే శివకుమార్(DK Shivakumar) కరచాలనం చేశారు. గత కొంతకాలంగా ఇద్దరూ తీవ్ర స్థాయిలో విమర్శించుకుంటున్న విషయం తెలిసిందే. మాజీ సీఎం బసవరాజ్ బొమ్మైను సీఎం సిద్దరామయ్య కరచాలనం చేసి స్వాగతించారు. మరో మాజీ సీఎం సదానందగౌడను ఎలా ఉన్నారంటూ కుశలప్రశ్నలు వేశారు.
అఖిలపక్ష భేటీకి ఆరుగురు మాజీ సీఎంలు
అఖిలపక్ష భేటీకి ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. బీజేపీకి చెందిన బీఎస్ యడియూరప్ప, బసవరాజ్ బొమ్మై, డీవీ సదానందగౌడ, కాంగ్రె్‌సకు చెందిన వీరప్పమొయిలీ, జగదీశ్ శెట్టర్, జేడీఎ్‌సకు చెందిన కుమారస్వామిలు భాగస్వామ్యం కాగా మంత్రులు హెచ్‌కే పాటిల్, చలువరాయస్వామి, పరమేశ్వర్, కేజే జార్జ్, కృష్ణ బైరేగౌడ, ఢిల్లీలో అధికార ప్రతినిధి టీబీ జయచంద్ర పాల్గొన్నారు. ఎంపీలు సుమలత, తేజస్వి సూర్య, పీసీ మోహన్ సహా పలువురు పాల్గొనగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందితాశర్మ, సీఎం సెక్రటరీ రజనీశ్ గోయెల్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి రాకేశ్‌సింగ్, అడ్వకేట్ జనరల్ శశికిరణ్ శెట్టి, సీనియర్ న్యాయవాదులు మోహన్‌కాతరకి, న్యాయనిపుణులు, జలవనరుల నిపుణులు భాగస్వామ్యమయ్యారు.
సుప్రీం తీర్పు తర్వాత కీలక నిర్ణయం
తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌పై మరో రెండురోజుల్లో విచారణలు సాగుతున్నందున తదుపరి కీలక నిర్ణయం తీసుకోదలచారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సహా సీనియర్ న్యాయవాదులు ఢిల్లీలోనే మకాం వేసి తదుపరి విచారణకు రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు తమిళనాడుకు నీటి విడుదలపై మండ్య జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు బుధవారం కూడా కొనసాగాయి. రైతుసంఘాలు, అన్నదాతలు, ప్రజాసంఘాలు మద్దతు ఇచ్చాయి. ఇక బెంగళూరులో రాష్ట్ర రైతుసంఘం ప్రతినిధులు, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రు, చెరుకు రైతుల సంఘం అధ్యక్షుడు కురుబూరు శాంతకుమార్ నేతృత్వంలో ఖాళీబిందెలతో నిరసన సాగించారు.