Supreme court: ఇద్దరు కొత్త జడ్జీలతో ప్రమాణస్వీకారం చేయించిన సీజేఐ

ABN , First Publish Date - 2023-02-13T13:43:44+05:30 IST

సుప్రీంకోర్టుకు కొత్తగా పదోన్నతి పొందిన ఇద్దరు న్యాయమూర్తుల చేత భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సోమవారం ఉదయం..

Supreme court: ఇద్దరు కొత్త జడ్జీలతో ప్రమాణస్వీకారం చేయించిన సీజేఐ

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు కొత్తగా పదోన్నతి పొందిన ఇద్దరు న్యాయమూర్తుల చేత భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ (DY Chandrachud) సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ రాజేష్ బిందాల్ (Rajesh Bindal), జస్టిస్ అరవింద్ కుమార్ (Aravind Kumar) కొత్త న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

సుప్రీంకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జిల నియామకం జరిగినట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు గత శుక్రవారంనాడు ఒక ట్వీట్‌లో తెలిపారు. జస్టిస్ బిందాల్ అలబాహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందగా, జస్టిస్ కుమార్ గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ పదవి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. కొత్తగా ఇద్దరు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారంతో సీజేఐతో కలిపి సుప్రీంకోర్టుకు పూర్తి స్థాయిలో 34 మంది జడ్జీల నియామకం జరిగింది. ఈ ఇద్దరు న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం గత జనవరి 31న ప్రతిపాదించగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ నియామకాలకు ఆమోదముద్ర వేశారు.

కాగా, 1961 ఏప్రిల్ 16న జన్మించిన జస్టిస్ బిందాల్ ఈ ఏడాది ఏప్రిల్‌లో 62వ ఏట పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే, సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి లభించినందున మరో మూడేళ్ల పాటు ఆయన సర్వీసులో ఉంటారు. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 62 కాగా, సుప్రీంకోర్టు జడ్జిల పదవీ విరమణ 65 ఏళ్లుగా ఉంది. జస్టిస్ కుమార్ 1962 జూలై 14న జన్మించగా, 2023 జూలైలో 61వ పడిలోకి అడుగుపెట్టారు. గతవారమే ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొంది ప్రమాణస్వీకారం చేశారు.

Updated Date - 2023-02-13T13:44:35+05:30 IST