Punjab: కారు దొంగలతో పంజాబ్ పోలీసుల హోరాహోరీ.. పట్టుబడిన క్రిమినల్స్
ABN , Publish Date - Dec 16 , 2023 | 04:56 PM
గాంగ్‌స్టర్లపై పంజాబ్ ప్రభుత్వం ఉక్కుపిడికిలి బిగిస్తోంది. గత ఐదు రోజుల్లో ఆరవ ఎన్‌కౌంటర్ శుక్రవారంనాడు చోటుచేసుకుంది. పంజాబ్ పోలీసులకు, కారు దొంగలకు మధ్య మొహాలీలో చోటుచేసుకున్న ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కరడుకట్టిన నేరస్థులు పట్టుబడ్డారు.
మొహాలి: గాంగ్‌స్టర్ల (Gangsters) పై పంజాబ్ ప్రభుత్వం (Punjab government) ఉక్కుపిడికిలి బిగిస్తోంది. గత ఐదు రోజుల్లో ఆరవ ఎన్‌కౌంటర్ (Encounter) శుక్రవారంనాడు చోటుచేసుకుంది. పంజాబ్ పోలీసులకు, కారు దొంగలకు మధ్య చోటుచేసుకున్న ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కరడుకట్టిన నేరస్థులు పట్టుబడ్డారు. రాజ్‌పురకు చెందిన ప్రిన్సి ఎలియాస్ పరమ్వీర్, కురుక్షేత్రకు చెందిన కరమ్‌జిత్ ఈ ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డారని, వీరిద్దరికి పలు నేరాలు, కారు దొంగతనాలతో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు.
మొహాలీ ప్రాంతంలో పేరుమోసిన నేరస్థులు సంచరిస్తున్నారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసు టీమ్ అక్కడకు చేరుకుందని మెహాలీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సందీప్ గార్గ్ తెలిపారు. లాండ్రాన్ రోడ్డుపై ఒక వాహనాన్ని ఆపినప్పుడు ఆ వాహనంలోని ఇద్దరు వ్యక్తులు ప్రతిఘటించడంతో పాటు, ఘటనా స్థలి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారని, ఆ ఇద్దర్నీ ప్రిన్స్, కరమ్‌జిత్‌గా ఆ తర్వాత గుర్తించామని చెప్పారు. కారు అపినప్పుడు నిందితులు పోలీసులపై కాల్పులకు దిగారని, దీంతో పోలీసులు ప్రతికాల్పులు జరపడంతో నిందితుల కాళ్లకు గాయాలైనట్టు గార్గ్ వివరించారు. కాగా, ఘటన జరిగిన సమయంలో నిందితులిద్దరూ దొంగిలించిన కారును డ్రైవ్ చేస్తున్నారని, వారి నుంచి రెండు ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. పట్టుబడిన ఇద్దరు నేరస్థులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.