CM: ఒప్పేసుకున్న సీఎం... రాష్ట్రంలో విద్యుత్ సమస్య నిజమే..
ABN , First Publish Date - 2023-10-17T13:18:03+05:30 IST
రాష్ట్రంలో విద్యుత్ సమస్య ఉన్న మాట నిజమేనని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) అంగీకరించారు.
- సీఎం సిద్దరామయ్య అంగీకారం
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్ సమస్య ఉన్న మాట నిజమేనని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) అంగీకరించారు. మైసూరులోని తన నివాసంలో సోమవారం జనతాదర్శన్ నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్రంలో వర్షాభావ స్థితి కారణంగా జల విద్యుత్ ఉత్పత్తి వంటివి దెబ్బతినడం సమస్యకు కారణమన్నారు. రైతులకు త్రీ-ఫేజ్ విద్యుత్‌ను గరిష్ఠంగా 5 గంటలపాటు సరఫరా చేయాలని ఇప్పటికే విద్యుత్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. దసరా వేడుకలు ముగుస్తూనే విద్యుత్ కొనుగోలు అంశంపై ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. చెరకు ఫ్యాక్టరీల నుంచి కూడా విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నామన్నారు. 2 వేల మెగావాట్ల విద్యుత్ కొరత ఉందని సీఎం అంగీకరించారు. రాష్ట్రంలోని 236 తాలూకాలకు గాను 216 తాలూకాల్లో తీవ్ర పరిస్థితి నెలకొని ఉందన్నారు. అయినా కూడా పశుగ్రాసానికి కొరత లేకుండా చూస్తున్నామన్నారు. 42 వేల హెక్టార్లలో పంటనష్టం జరిగిందన్నారు. నష్టం అంచనా రూ.30వేల కోట్లకుపైగా ఉందన్నారు. రాష్ట్రంలో కేంద్ర కరువు అధ్యయన బృందం పరిశీలించి వెళ్లిందన్నారు. తక్షణం రాష్ట్రానికి రూ.4,860 కోట్ల కరువు సాయం అందించాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశామని, కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.