Share News

CM: సీఎం సిద్దూ ఆసక్తికర కామెంట్స్.. జేడీ‘ఎస్’లో సెక్యులర్‌ పదాన్ని తీసేయండి.. బీజేపీలో విలీనమైనా ఆశ్చర్యం లేదు

ABN , First Publish Date - 2023-11-16T12:03:30+05:30 IST

జేడీఎస్‏లో సెక్యులర్‌ పదాన్ని తీసేయడం మంచిదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) ఆ పార్టీ నేతలకు

CM: సీఎం సిద్దూ ఆసక్తికర కామెంట్స్.. జేడీ‘ఎస్’లో సెక్యులర్‌ పదాన్ని తీసేయండి.. బీజేపీలో విలీనమైనా ఆశ్చర్యం లేదు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): జేడీఎస్‏లో సెక్యులర్‌ పదాన్ని తీసేయడం మంచిదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) ఆ పార్టీ నేతలకు సూచించారు. బెంగళూరు కేపీసీసీ కార్యాలయంలో తుమకూరు గ్రామీణ జేడీఎస్‌ మాజీ ఎమ్మెల్యే గౌరిశంకర్‌తోపాటు పలువురు ప్రముఖులు బుధవారం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని పార్టీలో సాదరంగా ఆహ్వానించిన ముఖ్యమంత్రి అనంతరం మీడియాతో మాట్లాడుతూ జేడీఎస్‏కు రాజకీయ పార్టీ లక్షణాలు లేవన్నారు. కుటుంబ పార్టీగానే అది మనుగడ సాగిస్తోందని అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీలో విలీనమైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని జోస్యం చెప్పారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల ప్రచార సమయంలో తాను జేడీఎ్‌సను బీజేపీ బీ-టీమ్‌ అంటూ అభివర్ణించానని, అది ఇప్పుడు అక్షరాలా నిజమైందని పేర్కొన్నారు. జేడీఎస్‌ వ్యవహార తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. జేడీఎస్‌ డబుల్‌గేమ్‌ను ప్రజలు బాగా అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో జేడీఎస్‌, బీజేపీలకు చెందిన మరింతమంది నేతలు కాంగ్రె్‌సలో చేరబోతున్నారని వివరించారు. తాము గ్యారెంటీ పథకాలను ప్రచారం చేసినప్పుడు ఎద్దేవా చేసిన ప్రధాని మోదీ ఇప్పుడు అవే గ్యారెంటీలకు తన పేరు పెట్టుకున్నారని చురకలంటించారు.

pandu1.jpg

కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న ప్రముఖుల్లో దాసరహళ్లికి చెందిన మంజునాథ్‌ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా హాజరైన ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌(DK Shivakumar) మాట్లాడుతూ గతంలో జేడీఎస్-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలినప్పుడు లక్ష్మణరేఖ దాటిన పలువురు తమ పార్టీ ఎమ్మెల్యేలు తనను ముఖ్యమంత్రిగా చేయాలని సూచించినా కుమారస్వామి పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు తాను సీఎం అయితే జేడీఎస్‌ ఎమ్మెల్యేలు 19 మంది మద్దతుగా ఉంటారని వ్యాఖ్యానిస్తున్నారన్నారు. కుమారస్వామి ఏ క్షణంలో ఏం మాట్లాడుతారో, ఎందుకు మాట్లాడతారో తెలియదన్నారు. లౌకిక సిద్ధాంతాలకు కట్టుబడిన కాంగ్రెస్‌ గతంలో 80 స్థానాలు దక్కినా 30 సీట్లు గెలిచిన కుమారస్వామిని సీఎంను చేసిందన్నారు. కుమారస్వామి సీఎంగా ఉన్నప్పుడు ఇదే బీజేపీ పదే పదే విమర్శలు, ఆరోపణలు గుప్పించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‏లో చేరిన నేతలందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కేపీసీసీ కార్యాధ్యక్షుడు సలీం అహ్మద్‌తోపాటు పలువురు సీనియర్‌ నేతలు హాజరయ్యారు.

Updated Date - 2023-11-16T12:38:14+05:30 IST