CM Siddaramaiah: సీఎం సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు.. మోదీతోనే దేశం దివాళా..

ABN , First Publish Date - 2023-07-22T11:57:03+05:30 IST

దేశం దివాళా తీసింది రాష్ట్రాలు అమలు చేసిన సంక్షేమ పథకాలతో కాదని, ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) చేసి

CM Siddaramaiah: సీఎం సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు.. మోదీతోనే దేశం దివాళా..

- సోషలిజానికి బీజేపీ వ్యతిరేకం

- వారితో జేడీఎస్‌ ఎందుకు చేతులు కలిపిందో..?

- రాష్ట్రవాటా సాధనలో ఎంపీలు విఫలం

- ఐదు గ్యారెంటీలు అమలు చేసి తీరతాం

- పరిషత్‌లో సీఎం సిద్దరామయ్య

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): దేశం దివాళా తీసింది రాష్ట్రాలు అమలు చేసిన సంక్షేమ పథకాలతో కాదని, ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) చేసిన అప్పులతోనే అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్థికమంత్రి హోదాలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సీఎం సిద్దరామయ్య విధానపరిషత్‌లో సమగ్ర వివరణ ఇచ్చారు. శుక్రవారం కార్యకలాపాల చివరిరోజు బడ్జెట్‌పై ముఖ్యమంత్రి రెండున్నర గంటలకుపైగా ప్రసంగించారు. ప్రతిపక్ష సభ్యులు లేక, ప్రశ్నించేవారు లేక ఉత్సాహమే లేదన్నారు. రాష్ట్రంలో మూడున్నరేళ్ల బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో తొమ్మిదేళ్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనపై ప్రతి అంశంలోనూ విరుచుకుపడుతూ వచ్చారు. సోషలిజానికి బీజేపీ వ్యతిరేకమన్నారు. వారికి నిప్పు పెట్టడమే పని అన్నారు. ప్రజల జేబు నుంచి చాకచక్యంగా డబ్బులు దోచేయడంలో వారే ప్రముఖులన్నారు. ప్రజా సమస్యలపై సభలో ప్రతిపక్ష సభ్యులు నిలదీయాలని, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపాలన్నారు. కానీ ప్రతిపక్షనేతను ఎంపిక చేయడంలో విఫలమైన బీజేపీ సభకు గైర్హాజరైందన్నారు. బడ్జెట్‌పై పరిషత్‌లో 15మంది సభ్యులు మాట్లాడితే అందులో 10 మంది కాంగ్రె్‌సవారే ఉన్నారని, ఇరువురు బీజేపీ, ముగ్గురు జేడీఎస్‌ సభ్యులు ఉన్నారన్నారు. అందులోనూ జేడీఎస్‌ మరితిబ్బేగౌడ, బీజేపీ విశ్వనాథ్‌ సాంకేతికంగా మాత్రమే ఆ పార్టీలో కొనసాగుతున్నారన్నారు. బడ్జెట్‌లో చర్చించి పేదలకు అనుకూలమయ్యే సలహాలు ఇవ్వడం ప్రతిపక్షాల బాధ్యత అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని అప్పులు చేసి దివాళా తీయించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐదు గ్యారెంటీలు ప్రకటిస్తే దివాళా తీస్తుందని ప్రధాని ఆరోపించారన్నారు. 2014-15 నాటికి కేంద్రం చేసిన అప్పులు రూ.5.31 లక్షల కోట్లు కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అప్పులను తొమ్మిదేళ్లలో రూ.17 లక్షల కోట్లకు పెంచారన్నారు. దీన్నిబట్టి 11.8 లక్షల కోట్లు అప్పులు చేశారని, ఇది మోదీ సాధన అని, దేశానికి కానుక అన్నారు. కర్ణాటకలో 2018 వరకు 2.45 లక్షల కోట్లు అప్పుగా ఉండేదని, గత ఐదేళ్లలో 5.71 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. 2013 - 18 మధ్యకాలంలో 1.16 లక్షల కోట్లు అప్పు చేశామని, ఇటీవల బీజేపీ 2.30 లక్షలకోట్లు అప్పు చేసిందన్నారు. అయినా ఎక్కడా అభివృద్ధి అమలు చేయలేదన్నారు. ప్రధానమంత్రి కార్పొరేట్‌ బిజినెస్‌ ట్యాక్స్‌ను 30 నుంచి 22 శాతానికి తగ్గించారని, తద్వారా ఏటా 2 లక్షల కోట్లు కేంద్రానికి నష్టమన్నారు. బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్‌ దిగ్గజాలకు 12 లక్షల కోట్ల రుణమాఫీ చేశారన్నారు. పేదలు, రైతులు, కార్మికులు, రైతు కూలీలకు ఎటువంటి ప్రయోజనం లేదన్నారు.

నిత్యావసరాలు పెనుభారం

నిత్యావసర ధరలు పెరిగేందుకు మూలకారణమైన పెట్రోల్‌ ఉత్పత్తులు, వంట గ్యాస్‌ ధరలను అమాంతంగా పెంచారని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) అన్నారు. 2011-12లో బ్యారెల్‌ ముడిచమురు 125.45 డాలర్లుగా ఉండేదని, అప్పుడు పెట్రోల్‌ రూ.45గా ఉండేదని 2016లో రూ.46.17 డాలర్లకు తగ్గిందని ప్రస్తుతం 79 డాలర్లుగా ఉందని అయినా పెట్రోల్‌ లీటరు రూ.102గా ఉందన్నారు. ఎక్సైజ్‌ డ్యూటీని భారీగా విధించడంతోనే సామాన్యులకు కష్టం వచ్చిందన్నారు. దేశంలో సెస్సు, సర్‌ చార్జీలు కర్ణాటక నుంచి అత్యధికంగా కేంద్రానికి వెళ్తున్నా రాష్ట్రవాటా ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కర్ణాటకకు నిరంతరంగా అన్యాయం జరుగుతోందన్నారు. మధ్యంతర నివేదిక ప్రకారం రాష్ట్రానికి రూ.5,495 కోట్లు రాకుండా రాష్ట్రం నుంచి ఎంపీగా కొనసాగుతున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ అడ్డుకున్నారని ఆరోపించారు. 25 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా ఒక్కరూ రాష్ట్ర వాటా గురించి పార్లమెంటులో లేవనెత్తలేదని, ప్రధాని వద్ద ప్రస్తావించలేదన్నారు. డబుల్‌ ఇంజన్‌ కాస్త ట్రబుల్‌ ఇంజన్‌గా మారి డబ్బా ఇంజన్‌ అయిందని ఎద్దేవా చేశారు. గ్యారెంటీలతో ప్రతి కుటుంబానికి ఆర్థికంగా చేయూతను ఇస్తున్నామన్నారు. గృహజ్యోతి ద్వారా విద్యుత్‌ బిల్లుల ఆదా, శక్తి గ్యారెంటీ ద్వారా ఉచిత ప్రయాణం, గృహ లక్ష్మి ద్వారా నిత్యావసర వస్తువుల ధరలకు కొంత ఉపశమనం, అన్నభాగ్య ద్వారా 4.42 కోట్ల మంది కడుపు నింపుకొనే సౌలభ్యం కల్పించామన్నారు. గ్యారెంటీలు అమలు చేయడం ద్వారా పేద వర్గాల వద్ద నగదు బదిలీ అవుతుంటుందని, తద్వారా జీడీపీ పెరుగుతుందన్నారు.

Updated Date - 2023-07-22T11:57:03+05:30 IST