CM Siddaramaiah: సీఎం సిద్దరామయ్య సంచలన ప్రకటన.. సిట్ దర్యాప్తు ప్రశ్నే లేదు..
ABN , First Publish Date - 2023-08-02T12:01:17+05:30 IST
ఉడుపి కళాశాల బాత్రూంలో రహస్యంగా మొబైల్ చిత్రీకరణ వ్యవహారానికి సంబంధించి పోలీసులు స్వచ్ఛందంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నా
- ఉడుపి బాత్రూం వీడియో వ్యవహారంపై సీఎం
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఉడుపి కళాశాల బాత్రూంలో రహస్యంగా మొబైల్ చిత్రీకరణ వ్యవహారానికి సంబంధించి పోలీసులు స్వచ్ఛందంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) వెల్లడించారు. ముఖ్యమంత్రి అయ్యాక రెండోసారి ఆయన మంగళవారం ఉడుపి జిల్లా పర్యటనకు వచ్చారు. పడుబిద్రి బీచ్‌లో సముద్రం కోతకు గురైన ప్రదేశాలను జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌తో కలసి పరిశీలించారు. విద్యార్థినులు, మహిళలతో సమావేశమై ప్రభుత్వ సంక్షేమపథకాల అమలు తీరుపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉడుపి రహస్య వీడియో చిత్రీకరణ వ్యవహారాన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)కు అప్పగించే ప్రశ్నే లేదన్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలైన సినీనటి ఖుష్బూ బాత్రూంలో ఎలాంటి రహస్య కెమెరా లేదని స్పష్టం చేసిన సంగతిని గుర్తు చేశారు. ఈ వ్యవహారాన్ని తమ ప్రభుత్వం సీరియ్‌సగానే తీసుకుందన్నారు. ఘటన జరిగిన నేత్రజ్యోతి కళాశాలలో హిందూ, ముస్లిం విద్యార్థులు అన్యోన్యంగా ఉన్నారని, సరదాకోసం ఆటపట్టించేందుకు చేసిన ప్రయత్నం వికటించడం, ఆనక క్షమాపణలు, విద్యార్థినుల సస్పెండ్‌తో ముగిసిందన్నారు. అయినా విద్వేష రాజకీయాలతోనే పబ్బం గడుపుకుంటూ సమాజంలో చిచ్చు రేపుతున్న బీజేపీ సంఘ్‌పరివార్ శక్తులు దీనిపై నానా యాగీ చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
బీజేపీ అధికారంలో ఉన్న మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను యావత్ ప్రపంచం దిగ్ర్భాంతికి లోనైనా రాష్ట్ర బీజేపీ నేతలు తమ నోళ్లకు టేపులు అంటించుకున్నారంటూ మండిపడ్డారు. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలతో దుష్ప్రచారం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకునేదిశలో చట్టాలకు పదును పెడుతున్నామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటివి యథేచ్ఛగా జరిగాయన్నారు. సోషల్ మీడియాలో ఇలాంటివి ప్రచారం చేస్తే తమ ప్రభుత్వం సహించబోదన్నారు. మోరల్ పోలీసింగ్‌పై నిర్ధాక్షిణ్య చర్యలు తీసుకోవాలని కోస్తాతీర జిల్లా అధికారులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చామని చెప్పారు. బిట్‌కాయిన్ వ్యవహారంలో సిట్ విచారణ జరిగితేగానీ నిజాల నిగ్గు తేలవన్నారు. కస్తూరిరంగన్ నివేదిక గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రంలో పర్యావరణ సంరక్షణ విషయంలో రాజీపడే ప్రశ్నే లేదన్నారు. సౌజన్య కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని పెద్దపెట్టున డిమాండ్ వస్తోందని, దీనిపై కోర్టులో అప్పీల్ చేయడంతోపాటు వివిధ అంశాలపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామన్నారు. కాగా దక్షిణకన్నడ, ఉడుపి జిల్లాల పర్యటనకు బయల్దేరే ముందు ముఖ్యమంత్రి దేవనహళ్లిలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీఐఏఎల్, ఎయిర్‌లైన్స్ కార్గోల సహకారంతో ఏర్పాటైన ఏవియేషన్ సెక్యూరిటీ కల్చరల్ వీక్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి కార్యదర్శి డాక్టర్ రజనీశ్ గోయెల్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బెంగళూరు ప్రాంతీయ కార్యాలయం ఇదే సందర్భంగా ప్రత్యేక వస్తు ప్రదర్శన ఏర్పాటు చేసింది.