Prime Minister Narendra Modiకి సీఎం స్టాలిన్ లేఖ
ABN , First Publish Date - 2023-02-06T10:50:31+05:30 IST
తడిసిన ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ నిబంధనలను సడలించి కావేరి డెల్టా రైతులను ఆదుకోవాలని కోరుతూ ప్రధాని
చెన్నై: తడిసిన ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ నిబంధనలను సడలించి కావేరి డెల్టా రైతులను ఆదుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి(Prime Minister Narendra Modi) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(State Chief Minister MK Stalin) ఆదివారం లేఖ రాశారు. కావేరి డెల్టా ప్రాంతాల్లో సాగునీటి కాలువలను త్వరితగతిన మరమ్మతు చేయడం, మేట్టూరు డ్యామ్ నుండి సకాలంలో సాగు నీరు విడుదల చేయడంతో తమిళ రైతాంగం గతం కంటే అధికంగా వరి సాగు చేసిందని,, ఆ మేరకు 16.43 లక్షల హెక్టార్లలో వరి పండించామని తెలిపారు. ఈ నెల మొదట్లో కురిసిన వర్షాలకు కోతకు సిద్ధంగా ఉన్న వరిపంట నీటి మునిగిందని తంజావూరు, తిరువారూరు, నాగపట్టినం, మైలాడుదురై, పుదుకోట జిల్లాల రైతులకు తీరని నష్టం కలిగించిందన్నారు. ఈ పరిస్థితులలో తడిసిన వరి కొనుగోళ్లలో పాటిస్తున్న నిబంధనలు సడలించాలని, రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ 22 శాతం వరకు తేమ కలిగిన ధాన్యం కొనేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. అపరిపక్వ, ముడుచుకున్న వరికి చెల్లించే ధరలో ఐదు శాతం రాయితీ కల్పించాలని, ఇదే విధంగా దెబ్బతిన్న, రంగుమారిన, మొలకెత్తిన వరికి చెల్లించే రాయితీని 5 శాతం నుండి 7 శాతానికి పెంచాలని స్టాలిన్ ఆ లేఖలో కోరారు.