Amit shah: మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరిస్తాం: అమిత్‌షా

ABN , First Publish Date - 2023-05-30T14:55:42+05:30 IST

అల్లర్లు, హింసాకాండతో అట్టుడికిన మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. పరిస్థితిని సమీక్షించేందుకు పౌర సంస్థలు, మహిళా నేతల బృందంతో మంగళవారంనాడు ఆయన సమావేశమయ్యారు.

Amit shah: మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరిస్తాం: అమిత్‌షా

ఇంఫాల్: అల్లర్లు, హింసాకాండతో అట్టుడికిన మణిపూర్‌లో (Manipur) శాంతిని పునరుద్ధరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah) తెలిపారు. పరిస్థితిని సమీక్షించేందుకు పౌర సంస్థలు, మహిళా నేతల బృందంతో మంగళవారంనాడు ఆయన సమావేశమయ్యారు. సమావేశానంతరం మీడియాతో అమిత్‌షా మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణకు, అభ్యుదయ పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని, అందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.

కల్లోలిత మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించేందుకు జరుపుతున్న ప్రయత్నాల్లో భాగంగా మైతి, కుకీ వర్గాల ప్రతినిధులతో అమిత్‌షా మంగళవారంనాడు సమావేశం కానున్నారు. నాలుగు రోజుల మణిపూర్ పర్యటనలో భాగంగా సోమవారంనాడు ఇంఫాల్ చేరుకున్న హోం మంత్రి ఆ వెంటనే ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్, ఆయన క్యాబినెట్ మంత్రులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, ఇంతవరకూ తీసుకున్న చర్యలను ఆయన సమీక్షించారు.

కాగా, రక్షణ సిబ్బంది చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ మాట్లాడుగూ, మణిపూర్‌లో తలెత్తిన సవాళ్లు ఇంకా సమసిపోలేదని, సమస్యలు పరిష్కారానికి మరికొంత సమయం పడుతుందని చెప్పారు. ఇయితే ఈ ఘటనలు తిరుగుబాటుకు సంబంధించిన ఘటనలు కావని తెలిపారు. మే 3న మైతీ, కుకీ తెగల మధ్య తలెత్తిన ఘర్షణలు హింసాత్మకంగా మారారు. 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఇళ్లు విడిచిపెట్టి సహాయక శిబిరాలకు తరలివెళ్లారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర బలగాలు కొద్దికాలంగా రాజధాని నగరంలోనూ, అల్లర్లకు అవకాశం ఉన్న ప్రాంతాల్లోనూ మోహరించాయి.

Updated Date - 2023-05-30T14:59:14+05:30 IST