Congress 5 Guarantees: పెద్ద వార్తే ఇది.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో 24 గంటల్లోపే..
ABN , First Publish Date - 2023-06-01T13:05:46+05:30 IST
కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీ పథకాలకు గ్రహణం తొలగిపోనుందా..? శుక్రవారం జరిగే మంత్రి మండలి కీలక సమావేశంలోనే వీటిపై ఒక స్పష్టత
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీ పథకాలకు గ్రహణం తొలగిపోనుందా..? శుక్రవారం జరిగే మంత్రి మండలి కీలక సమావేశంలోనే వీటిపై ఒక స్పష్టత రానుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Chief Minister Siddaramaiah and Deputy Chief Minister DK Shivakumar) బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్ని పథకాలకు గ్రాంట్ల మంజూరు ప్రక్రియ జరుగుతోందన్నారు. వీటిలో కొన్ని పథకాల విషయంలో ఆర్థికశాఖ నుంచి క్లియరెన్స్ ఇంకా లభించలేదని తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే అమలులో ఉన్న సంక్షేమ పథకాలను క్రోడీకరించి గ్యారెంటీలకు రూపురేఖలు ఇవ్వాలని బుధవారం జరిగిన మంత్రుల సమావేశం అభిప్రాయపడింది. గ్యారెంటీల అమలులో ఆచితూచి ముందడుగులు వేయాలని ఆర్థికశాఖ హెచ్చరికలు జారీ చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. హడావిడిగా పథకాలను ప్రారంభించి అభాసుపాలయ్యే కంటే పక్కాగా వీటిని అమలు చేసే అంశంపైనే ప్రభుత్వం దృష్టిని సారించింది. ఇప్పటికే మూడుసార్లు గ్యారెంటీ పథకాలపై కేబినెట్‌లో చర్చలు జరిగినప్పటికీ తుది నిర్ణయానికి రాలేకపోయారు. మొత్తం 5 పథకాలను ఒకేసారి అమలు చేస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) అంటున్నప్పటికీ వీటిలో ఉచిత విద్యుత్, ఉచిత ప్రయాణం పథకాలపై శుక్రవారం కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఐదు పథకాల అమలుకు మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
అధిష్టానం నుంచి ప్రత్యేక సూచనలు
ఎన్నికల సమయంలో గ్యారెంటీల అమలుకు తాము హామీగా ఉంటామంటూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో ఈ ప్రయోగం విజయవంతం కావడంతో త్వరలో జరిగే రాజస్థాన్, తెలంగాణ, మధ్యప్రదేశ్ ఎన్నికల్లోనూ అమలు చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ కర్ణాటకలో వీటిని అమలు చేసి చూపాలని గట్టి పట్టుతో ఉంది. ఈ నేపథ్యంలో అధిష్టానంవైపు నుంచి కూడా ఐదు గ్యారెంటీలపై ఒత్తిడి అధికంగా ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
గ్యారెంటీల చుట్టే రాజకీయాలు...
రాష్ట్ర రాజకీయాలు కొన్ని రోజులుగా గ్యారెంటీల చుట్టే తిరుగుతున్నాయి. బీజేపీ నేతలు ప్రతిరోజూ తమ మీడియా సమావేశాలలో కాంగ్రెస్ గ్యారెంటీల గురించే నిలదీస్తున్నారు. శుక్రవారం వరకు ఎదురు చూసి ఆపై తాము స్పందిస్తామని మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై(Former CM Basavaraj Bommai) బుధవారం ట్వీట్ చేశారు.
అతీక్‌కు ఆర్థిక శాఖ బాధ్యతలు
ఐదు గ్యారెంటీ పథకాల అమలుకు ఆర్థిక వనరులను సజావుగా సమకూర్చేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్‌కే అతీక్‌ను నియమించే దిశలో ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఆర్థికశాఖ అదనపు ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఐఎస్ఎన్ ప్రసాద్ పదవీ విరమణ నేపథ్యంలో ఈ కీలక పదవికి అతీక్‌ను తీసుకొచ్చే దిశలో భాగంగా ఆయనను ఆర్థికశాఖ ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రసాద్ జూన్ 30న రిటైర్ కానున్నారు. ఆర్థికశాఖ వ్యవహారాలపై ఏడేళ్లుగా ప్రసాద్ తనదైన ముద్ర వేశారు. సీఎం పేషీలో మైనారిటీ అధికారులకు అవకాశం లేదన్న విమర్శల నేపథ్యంలో అతీక్ ప్రాధాన్యత సంతరించుకుంది.