Israel Vs palestine: ఇజ్రాయెల్‌పై దాడులను ఖండించిన కాంగ్రెస్... బీజేపీ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్

ABN , First Publish Date - 2023-10-08T16:36:49+05:30 IST

ఇజ్రాయెల్‌ పై హమాస్ మిలిటెంట్ల దాడులను కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు ఖండించింది. ఇదే సమయంలో 2004-2014 మధ్య ఇండియా కూడా ఇలాంటి దాడులనే చవిచూసిందని, వీటిని ఎప్పటికీ మరచిపోలేమని బీజేపీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టింది.

Israel Vs palestine: ఇజ్రాయెల్‌పై దాడులను ఖండించిన కాంగ్రెస్... బీజేపీ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌ (Israel)‌పై హమాస్ మిలిటెంట్ల (Hamas militants) దాడులను కాంగ్రెస్ (Congress) పార్టీ ఆదివారంనాడు ఖండించింది. ఇదే సమయంలో 2004-2014 మధ్య ఇండియా కూడా ఇలాంటి దాడులనే చవిచూసిందని, వీటిని ఎప్పటికీ మరచిపోలేమని బీజేపీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టింది. పాలస్థీనా ప్రజల చట్టబద్ధమైన ఆకాంక్షలను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ మొదట్నించీ చెబుతోందని, అయితే హింస అనేది ఏ సమస్యకు పరిష్కారం కాదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఆదివారంనాడు ఒక ట్వీట్‌లో అన్నారు.


''ఇజ్రాయెల్ ప్రజల ప్రయోజనాలు, జాతీయ భద్రతను కాంగ్రెస్ గౌరవిస్తోంది. ఇదే సమయంలో ఆత్మగౌరవం, సమానత్వం, గౌరవం వంటి పాలస్థీనా ప్రజల ఆకాంక్షలు నెరవేరేందుకు చర్చలు, సంప్రదింపులే పరిష్కారమని కూడా బలంగా నమ్ముతోంది. హింస ఏ రూపంలో ఉన్నా అది సమస్యకు పరిష్కారం కాదు. హింసాకాండను విడనాడాలి'' అని జైరామ్ రమేష్ అన్నారు.


ఇజ్రాయెల్‌పై దాడులను బీజేపీ శనివారంనాడు ప్రస్తావిస్తూ, ముంబై దాడులతో సహా ఇండియాలో జరిగిన పలు ఉగ్ర సంఘటనలను ఉదహరించింది. ఈరోజు ఇజ్రాయెల్ ఏదైతే ఎదుర్కొంటోందో ఇండియా కూడా 2004-14 మధ్య ఇదే పరిస్థితిని ఎదుర్కొందంటూ బీజేపీ ఒక వీడియోను విడుదల చేసింది. ప్రతి ఒక్క ఉగ్రదాడిని ఆపడం సాధ్యం కాదంటూ రాహుల్ ఇచ్చిన ఒక స్టేట్‌మెంట్‌ కూడా ఆ వీడియోలో కనిపించింది.

Updated Date - 2023-10-08T16:36:49+05:30 IST