Narendra Modi: ఉగ్రవాదులను బుజ్జగించిన చరిత్ర కాంగ్రెస్‌దే: మోదీ
ABN , First Publish Date - 2023-05-02T16:16:30+05:30 IST
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మరోసారి కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ఉగ్రవాదం..
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మరోసారి కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) విరుచుకుపడ్డారు. ఉగ్రవాదం, ఉగ్రవాదులను బుజ్జగించిన చరిత్ర ఆ పార్టీదేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీలా కాకుండా తమ పార్టీ ఉగ్రవాదం, బుజ్జగింపు రాజకీయల నడ్డి విరిచిందని చెప్పారు. చిత్రదుర్గలో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో 2008 బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌ను మోదీ ప్రస్తావించారు. ఢిల్లీ జామియా నగర్‌లోని అద్దె ఇంట్లో ఉన్న ఇద్దరు టెర్రరిస్టులను పోలీసు టీమ్ మట్టుబెట్టిందని, అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా ఉగ్రవాదుల కాల్చివేత వార్త వినగానే ''కళ్ల నీళ్లు'' పెట్టుకున్నారని అన్నారు. సర్జికల్ దాడులు, వాయిదాడులు జరిగినప్పుడు మాత్రం దేశ బలగాల సామర్థ్యాన్ని కాంగ్రెస్ ప్రశ్నించిందని అన్నారు.
''టెర్రన్‌ను ఏవిధంగా కాంగ్రెస్ ప్రమోట్ చేసిందో కర్ణాటకలో మీరు చూశారు. ఉగ్రవాదుల దయాదాక్షిణ్యాలపై రాష్ట్రాన్ని వదిలేసింది. బీజీపీ ఇందుకు భిన్నంగా బుజ్జగింపు రాజకీయాల నడ్డి విరిచింది'' అని మోదీ అన్నారు.
దొందూదొందే..
కర్ణాటక ప్రజలు ఇటు కాంగ్రెస్ పట్ల, అటు జేడీఎస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, తాము రెండూ వేర్వేరు పార్టీలని చెబుతున్నా వారి హృదయం ఒక్కటేనని అన్నారు. రెండూ కుటుంబపాలనా పార్టీలేనని, అవినీతిని ప్రోత్సహించాయని, సమాజాన్ని విడగొట్టే విభజన రాజకీయాలకు పాల్పడుతుంటాయని, కర్ణాటక అభివృద్ధి అనేది ఆ రెండు పార్టీల ప్రాధాన్యతా క్రమంలో లేనేలేదని అన్నారు. కర్ణాటకను దేశ అభివృద్ధికి దోహదం చేసే 'గ్రోత్ ఇంజన్'గా తాము మారుస్తామని, ఇది సాధించాలంటే కర్ణాటకలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలని అన్నారు. దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా కర్ణాటకను తీర్చిదిద్దే విజన్ డాక్యుమెంట్‌ను తాము ప్రకటించినట్టు చెప్పారు. అధునాతన వసతుల కల్పన, మహిళా సాధికారతకు తాము పెద్దపీట వేశామని తెలిపారు.
డప్పు వాయించిన ప్రధాని..
ఎన్నికల ర్యాలీలో కర్ణాటక సాంప్రదాయ డబ్బు వాద్యాన్ని మోదీ మోగిస్తూ సభికులను ఉత్సాహపరిచారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 10న జరుగనుండగా, 13న ఫలితాలు వెలువడతాయి.