Chidambaram: తమిళనాడు గవర్నర్‌పై చిదంబరం ధ్వజం
ABN , First Publish Date - 2023-04-07T23:10:34+05:30 IST
గవర్నర్లు ప్రజాస్వామ్యాన్ని తుంగలతో తొక్కి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబరం విమర్శించారు.
చెన్నై: కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం నియమిస్తున్న గవర్నర్లు ప్రజాస్వామ్యాన్ని తుంగలతో తొక్కి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సీనియర్ కాంగ్రెస్(Congress) నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం (P Chidambaram) విమర్శించారు. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి (Tamil Nadu Governor R N Ravi) రాజ్‌భవన్‌లో సివిల్ సర్వీసెస్ అభ్యర్థులతో మాట్లాడుతూ శాసనసభ ఆమోదించిన బిల్లును పెండింగ్‌లో ఉంచితే ఆ బిల్లును గవర్నర్ తిరస్కరిస్తున్నారనే భావించాలంటూ సరికొత్త వక్రభాష్యం చెప్పారని చిదంబరం అన్నారు.
ఆమోదం కోసం రాష్ట్ర శాసనసభ పంపిన బిల్లులపై గవర్నర్ మూడు రకాల నిర్ణయాలు తీసుకోవచ్చునని బిల్లును ఆమోదించడం, పెండింగ్‌లో ఉంచడం, లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపడం అంటూ మూడు నిర్ణయాలు తీసుకోవచ్చునని, పెండింగ్‌లో ఉంచడమంటే ఆ బిల్లును తిరస్కరించినట్లేనని చెప్పడం వింతగా విడ్డూరంగా ఉందని చిదంబరం అన్నారు. బిల్లును పెండింగ్‌లో ఉంచితే ఆ బిల్లును డెడ్ బిల్లుగా భావించాలని చెప్పడం గర్హనీయమన్నారు. ముఖ్యమంత్రి, మంత్రివర్గం సలహాలకు కట్టుబడి ఉండటమే గవర్నర్ విధి అని అన్నారు. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియమించిన గవర్నర్లు ప్రజాస్వామ్యాన్ని తుంగలోకి తొక్కుతున్నారని చిదంబరం విమర్శించారు.