Manipur : హిమంత బిశ్వ శర్మపై చిదంబరం మండిపాటు

ABN , First Publish Date - 2023-07-02T15:52:00+05:30 IST

అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం మండిపడ్డారు.

Manipur : హిమంత బిశ్వ శర్మపై చిదంబరం మండిపాటు
P Chidambaram

న్యూఢిల్లీ : అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం (P Chidambaram) మండిపడ్డారు. మణిపూర్ సమస్యలో శర్మ తలదూర్చకుండా ఉంటే మంచిదని, ఎన్ బిరేన్ సింగ్ మణిపూర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని, ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. మే 3 నుంచి మణిపూర్‌లో మెయిటీలు, కుకీల మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sharma) శనివారం మణిపూర్ పరిస్థితిపై స్పందిస్తూ, ఆ రాష్ట్రంలో పరిస్థితి రోజు రోజుకూ మెరుగుపడుతోందని చెప్పారు. రానున్న వారం, పది రోజుల్లో మరింత మెరుగవుతుందని తాను అభిప్రాయపడుతున్నానని చెప్పారు.

దీనిపై పీ చిదంబరం స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, మణిపూర్‌లో ఓ వారం రోజుల్లో శాంతి నెలకొంటుందని అస్సాం ముఖ్యమంత్రి శర్మ చెప్తున్నారని, ఆయన ఆ రాష్ట్రం విషయంలో తల దూర్చకుండా ఉంటే మంచిదని తెలిపారు. ఎన్ బిరేన్ సింగ్ (N Biren Singh) మణిపూర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం శ్రేయస్కరమని, కొన్ని నెలలపాటు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.

బిరేన్ సింగ్ రాజీనామా హైడ్రామా

మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ శుక్రవారం రాజీనామా సమర్పించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన నివాసంతోపాటు రాజ్ భవన్ వద్ద హైడ్రామా కనిపించింది. ఆయన గవర్నర్‌కు రాజీనామా సమర్పించేందుకు వెళ్తున్నట్లు వార్తలు రావడంతో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆయనను అడ్డుకున్నారు. ఫలితంగా ఆయన తన రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.

బిరేన్ సింగ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కొన్ని చోట్ల ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలను తగులబెట్టినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అదేవిధంగా బీజేపీ కార్యాలయంపై దాడికి ప్రయత్నాలు జరిగాయన్నారు. గడచిన ఐదు, ఆరు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం, తాము మణిపూర్ కోసం ఎంతో కృషి చేశామన్నారు. ప్రస్తుత పరిస్థితిని చూసినపుడు ప్రజల నమ్మకాన్ని తాము కోల్పోయామేమోనని సందేహం కలుగుతోందన్నారు. దీని గురించి ఆలోచించడంతో తన మనసు పాడైందన్నారు. ఓ మార్కెట్ వద్ద కొన్ని రోజుల క్రితం కొందరు తనపై దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తన మద్దతుదారులు బాధతో విలపించారని, తనకు మద్దతు ప్రకటించారని, అందువల్ల తన సందేహాలు నివృత్తి అయ్యాయని చెప్పారు. రాజీనామా చేయవద్దని వారు తనకు చెప్పారన్నారు. రాజీనామా చేయాలని వారు తనకు చెబితే వెంటనే తాను రాజీనామా చేస్తానన్నారు.

మే 3 నుంచి మెయిటీలు, కుకీల మధ్య జరుగుతున్న హింసాత్మక ఘర్షణల్లో ఇప్పటి వరకు సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి :

Manipur violence : మణిపూర్ హింసాకాండ వెనుక విదేశీ శక్తులు : సీఎం బిరేన్ సింగ్

Maharashtra : శరద్ పవార్‌కు గట్టి ఝలక్ ఇచ్చిన అజిత్ పవార్.. సాయంత్రం మహారాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం!..

Updated Date - 2023-07-02T15:52:58+05:30 IST