BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టోపై దుమ్మెత్తిపోసిన కాంగ్రెస్.. కాపీ-క్యాట్ అంటూ జైరాం రమేశ్ ధ్వజం
ABN , First Publish Date - 2023-11-04T22:36:31+05:30 IST
ఛత్తీస్‌గఢ్ ఎన్నికల కోసం శుక్రవారం బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తామిచ్చిన హామీలనే వాళ్లు కొట్టారంటూ మండిపడింది. తమ ఎన్నికల హామీల్ని ‘ఉచితాలు’ అని విమర్శించిన బీజేపీ..
ఛత్తీస్‌గఢ్ ఎన్నికల కోసం శుక్రవారం బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తామిచ్చిన హామీలనే వాళ్లు కొట్టారంటూ మండిపడింది. తమ ఎన్నికల హామీల్ని ‘ఉచితాలు’ అని విమర్శించిన బీజేపీ.. ఇప్పుడు ఎన్నికల్లో గెలవడం కోసం అవే హామీలు ఇస్తోందని కాంగ్రెస్ తూర్పారపట్టింది. తమ హామీలనే బీజేపీ మక్కీకి మక్కీ దింపేసి.. అవి ‘తమ’ హామీలుగా ఆ పార్టీ బిల్డప్పులు కొడుతోందని.. ఇదొక కాపీ-క్యాట్ మేనిఫెస్తో అని ధ్వజమెత్తింది.
బీజేపీ విడుదల చేసిన ఈ మేనిఫెస్టోపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘శుక్రవారం బీజేపీ చత్తీస్‌గఢ్‌లో ఒక మేనిఫెస్టోను విడుదల చేసింది. తమ హామీలను ఎవరైతే ‘ఉచితాలు’ అంటూ ఇన్నాళ్లూ విమర్శించారో.. ఎన్నికల్లో గెలుపొందడం కోసం అవే హామీల్ని ఇచ్చారు. బీజేపీ విడుదల చేసిన ఈ మేనిఫెస్టో ఒక కాపీ-క్యాట్ మేనిఫెస్టో’’ అని నిప్పులు చెరిగారు. ఎల్‌పీజీ సిలిండర్, వరి సేకరణ ధరలు, ఇవన్నీ కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానాలని అన్నారు. రాహుల్ గాంధీ గ్యారెంటీ అనే పదాన్ని ఉపయోగించినప్పుడు బీజేపీ దాన్ని తీవ్రంగా విమర్శించిందని.. ఇప్పుడు వాళ్లు ‘మోదీకి గ్యారెంటీ’ గురించి మాట్లాడుతున్నారని విసుర్లు విసిరారు.
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ తప్పకుండా పరాజయం పాలవుతుందని, ఆ పార్టీకి ఓటమి తప్పదని జైరాం రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో ఇద్దరు ఓబీసీ సీఎంలను బీజేపీ టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. అయితే.. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ సంక్షేమ పథకాలు విజయవంతమై ప్రజలు స్వాగతిస్తున్నందున.. కాంగ్రెస్‌ని దెబ్బతీయాలన్న వారి ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయని పేర్కొన్నారు. చివరి క్షణంలో ప్రధానమంత్రి, అతని సహచరులు ప్రజలను మరల్చడానికి, కాంగ్రెస్ నాయకులను పరువు తీయడానికి వ్యూహాలు పన్నుతున్నారని.. కానీ ప్రజలకు ఈ కుట్రల గురించి తెలుసని అన్నారు. గత ఐదేళ్లలో కాంగ్రెస్ చేసిన పనిని ముందుకు తీసుకెళ్లాలని ప్రజలకు తెలుసునని కేంద్ర మాజీ మంత్రి చెప్పారు.
రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చెప్పిన కాంగ్రెస్ హామీలను తప్పకుండా నెరవేరుస్తామని హామీ జైరాం రమేశ్ హామీ ఇచ్చారు. బీజేపీ కూడా ఇప్పుడు హామీ పదాన్ని ఉపయోగిస్తోందన్నారు. కానీ.. వాళ్లు ‘బీజేపీ హామీ’ అని చెప్పకుండా ‘మోదీ హామీ’ అని చెప్తున్నారన్నారు. అయితే.. మాట తప్పడం, మడమ తిప్పడంలో ప్రధాని మోదీ ప్రసిద్ధి చెందారని.. ఇప్పుడు హామీల విషయంలో దొరికిపోయి ‘కాపీ-క్యాట్’గా మారారని సెటైర్లు వేశారు. గతంలో తమ పథకాలను ‘ఉచితాలు’ అంటూ విమర్శించిన మోదీకి.. ఇప్పుడు అవే ఉచితాలు గ్యారెంటీగా మారిందని ఎద్దేవా చేశారు. ఇదిలావుండగా.. కాంగ్రెస్ పార్టీ ఇంకా ఛత్తీస్‌గఢ్ ఎన్నికల కోసం తన మేనిఫెస్టోని విడుదల చేయాల్సి ఉంది.
బీజేపీ మేనిఫెస్టో
రాయ్‌పూర్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం కుషాభౌ ఠాక్రే పరిసార్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘ఛత్తీస్‌గఢ్ 2023కి మోదీ హామీ’ పేరుతో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. బీజేపీ ఇచ్చిన హామీల్లో.. వివాహిత మహిళలు, భూమిలేని వ్యవసాయ కూలీలకు వార్షిక ఆర్థిక సహాయం.. క్వింటాల్‌కు రూ.3,100 చొప్పున వరి సేకరణ.. పేద కుటుంబాలకు రూ.500 చొప్పున వంట గ్యాస్ సిలిండర్ వంటివి ఉన్నాయి.