INDIA Alliance: త్వరలో ఇండియా కూటమి నేతల సమావేశం.. సీట్ల పంపకమే ప్రధాన అజెండా
ABN , First Publish Date - 2023-12-10T14:50:02+05:30 IST
ఇండియా కూటమి(INDIA Alliance) నేతలు త్వరలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు డిసెంబర్ 19న ఢిల్లీలో సమావేశం జరగనుంది.
ఢిల్లీ: ఇండియా కూటమి(INDIA Alliance) నేతలు త్వరలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు డిసెంబర్ 19న ఢిల్లీలో సమావేశం జరగనుంది. మీటింగ్ లో ప్రధాన అజెండాగా రానున్న లోక్ సభ ఎన్నికల సందర్భంగా(Lokhsabha Elections 2024) పార్టీల మధ్య సీట్ల పంపకం చేయడమే అని తెలుస్తోంది.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఎన్డీఏను దెబ్బతీయాలని నేతలు భావిస్తున్నారు. అయితే ఈ సారి జరిగే సమావేశంలో కాంగ్రెస్ కఠిన పరిస్థితులు ఎదుర్కుంటోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ మూడు రాష్ట్రాల్లో ఘోర ఓటమిపాలైంది. ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో బీజేపీ ఘన విజయం సాధించింది.
దీంతో ప్రధాన ప్రతిపక్షం, ఇండియా కూటమికి చెందిన ప్రధాన పార్టీ కాంగ్రెస్ పై సీట్ల పంపకంలో ఒత్తిడి తెచ్చే అవకాశమూ లేకపోలేదు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో విభేదాలను కూడా కాంగ్రెస్ పరిష్కరించుకోవడంతో.. ఆయన కూడా త్వరలో జరిగే సమావేశానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
అఖిలేష్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ గైర్హాజరుతో గతవారం జరగాల్సిన మీటింగ్ వాయిదా పడింది. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు మినహా మిగతా రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ ఫలితాలు ఆ పార్టీ సాధించలేదు. వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కూడిన ఎన్డీఏ కూటమి ఢీ కొట్టడానికి ప్రతిపక్ష నేతలు ఇండియా కూటమిగా జతకట్టారు.