Yogi Adityanath: జ్ఞానవాపిని మసీదు అనడమే వివాదం: యోగి
ABN , First Publish Date - 2023-08-01T03:56:37+05:30 IST
జ్ఞానవాపిని మసీదు( Gyanvapi Mosque) అనడమే ఓ వివాదమంటూ ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) సంచలన వ్యాఖ్యలు చేశారు.
మసీదులో త్రిశూలం ఎందుకుంది?
దేవతా ప్రతిమలు ఎందుకున్నాయి??
మేం తీసుకెళ్లి పెట్టినవి కాదు కదా
ముస్లింలు చారిత్రక తప్పిదాన్ని గుర్తించాలి
ఈ సమస్య పరిష్కారానికి సహకరించాలి
యూపీ సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, జూలై 31: జ్ఞానవాపిని మసీదు( Gyanvapi Mosque) అనడమే ఓ వివాదమంటూ ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘ఒకవేళ అది మసీదే అయితే.. ఆ మసీదు లోపల త్రిశూలం ఎందుకుంది? దేవతల ప్రతిమలు ఎందుకున్నాయి? మేము తీసుకొచ్చి పెట్టలేదు కదా??’’ అని ప్రశ్నించారు. సోమవారం ఏఎన్‌ఐ వార్తా సంస్థ ఎడిటర్ స్మితాప్రకాశ్(Smitaprakash)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2021లో ఢిల్లీకి చెందిన ఐదుగురు మహిళలు జ్ఞానవాపిలో పూజలకు అనుమతించాలంటూ వారాణసీ కోర్టు(Varanasi Court)ను ఆశ్రయించడంతో ఈ వివాదం మొదలైన విషయం తెలిసిందే.
స్థానిక కోర్టు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎ్‌సఐ)ను వీడియో సర్వేకు ఆదేశించగా.. మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లింది. రెండు మూడు రోజుల్లో కోర్టు ఈ వ్యాజ్యంపై తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ తాజా వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ‘‘జ్ఞానవాపి అనేది మసీదుగా మారడం ఓ చారిత్రక తప్పిదం. ముస్లిం సమాజం ఈ సమస్య పరిష్కారానికి సహకరించాలి’’ అని యోగి కోరారు. యోగి వ్యాఖ్యలను హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) ఖండించారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు యోగి ఇలా మాట్లాడడం న్యాయవ్యవస్థను ధిక్కరించడమేనన్నారు.