PM Narendra Modi: కాంగ్రెస్‌కు తట్టాబుట్టా సర్దేసే సమయం ఆసన్నమైంది.. ప్రధాని మోదీ చురకలు
ABN , First Publish Date - 2023-11-13T16:05:58+05:30 IST
PM Modi: ఛత్తీస్‌గఢ్‌లో అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం బీజేపీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ద్వేషం రగిల్చేందుకు.. ఆ పార్టీపై బీజేపీ నేతలు ఎన్నో ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ అయితే.. మొదటి నుంచే ప్రతీ విషయంలోనూ కాంగ్రెస్ పార్టీని తప్పు పడుతూనే ఉన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం బీజేపీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు.. ఆ పార్టీపై బీజేపీ నేతలు ఎన్నో ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ అయితే.. మొదటి నుంచే ప్రతీ విషయంలోనూ కాంగ్రెస్ పార్టీని తప్పు పడుతూనే ఉన్నారు. తాజాగా ఆయన మరోసారి కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. ఛత్తీస్‌గఢ్‌లోని ముంగేళి రాష్ట్రంలో నిర్వహించిన ర్యాలీలో.. సీఎం భూపేష్ బఘేల్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఛత్తీస్‌గఢ్ నుంచి కాంగ్రెస్ నిష్క్రమించే సమయం ఆసన్నమైందని, ఇచ్చిన వాగ్ధానాలను ఆ పార్టీ నెరవేర్చలేదంటూ ఆయన విరుచుకుపడ్డారు.
భూపేష్ బఘేల్, డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ డియో మధ్య కుదిరిన అధికార భాగస్వామ్య ఒప్పందాన్ని ప్రధాని మోదీ తప్పుపడుతూ.. తమ స్వంత సీనియర్ లీడర్లను కాంగ్రెస్ పార్టీ మోసం చేయగలిగినప్పుడు, ప్రజలను ఇది ఉపేక్షిస్తుందా? అని ప్రశ్నించారు. అబద్ధపు వాగ్ధానాలతో కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేస్తోందని, ఇప్పటివరకూ వారికి ఇచ్చిన హామీల్ని ఆ పార్టీ నెరవేర్చలేదని ఆరోపణలు చేశారు. చత్తీస్‌గఢ్‌లో తమ సమయం ముగిసిందన్న విషయం కాంగ్రెస్ పార్టీకి కూడా అర్థమైందని వ్యాఖ్యానించారు. ఈసారి భూపేష్ తన స్వంత నియోజకవర్గంలోనే ఓడిపోతారని తనకు ఢిల్లీలోని జర్నలిస్ట్ స్నేహితులు, రాజకీయ విశ్లేషకులు చెప్పారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తనని ఎంతో ద్వేషిస్తుందని, మొత్తం ఓబీసీ వర్గాన్ని ఆ పార్టీ దూషిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘కాంగ్రెస్ పార్టీ మోదీని ద్వేషిస్తోంది. ఇప్పుడు వాళ్లు మోదీ కమ్యునిటీని కూడా ద్వేషించడం ప్రారంభించారు. గత కొన్ని నెలలుగా మోదీ పేరుతో మొత్తం ఓబీసీ వర్గాన్ని కాంగ్రెస్ దూషిస్తోంది. అలా చేయొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసినా, వాళ్లు క్షమాపణలు చెప్పడానికి నిరాకరించారు. ఓబీసీ కమ్యూనిటీ పట్ల వారికి ఎంత ద్వేషం ఉందో చెప్పడానికి ఇదే ఉదాహరణ’’ అని మోదీ వ్యాఖ్యానించారు. బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అవమానించింది కాంగ్రెస్సేనని.. బాబాసాహెబ్ రాజకీయాలను అంతం చేయడానికి కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపణలు గుప్పించారు. ఓటు బ్యాంకు, బుజ్జగింపుల కోసం కాంగ్రెస్ ఏం చేయడానికైనా సిద్ధపడుతుందని ప్రధాని మోదీ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు.
ఇదిలావుండగా.. ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లన్నాయి. నవంబర్ 7వ తేదీన 20 స్థానాలకు పోలింగ్ జరిగింది. మిగిలిన 70 స్థానాలకు నవంబర్ 17వ తేదీన పోలింగ్ జరగనుంది. కొన్ని సర్వేలు.. ఛత్తీస్‌గఢ్‌లో తిరిగి కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని తేల్చాయి. అయితే.. బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ అధికారం చేజిక్కించుకోవాలని సాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఛత్తీస్‌గఢ్ ఇచ్చింది తామేనని, సెంటిమెంట్‌తో ఓటర్లను ఆకర్షించడానికి కూడా బీజేపీ వెనుకాడటం లేదు. మరి.. ఫలితాలు ఎలా వస్తాడో చూడాలి.