Destination weddings: శివపార్వతులు సత్య యుగంలో పెళ్లి చేసుకున్న చోట పెరుగుతున్న పెళ్లిళ్లు
ABN , First Publish Date - 2023-07-05T09:32:33+05:30 IST
పెళ్లి అంటే నూరేళ్ల పంట. అనేక కుటుంబాల మధ్య బంధుత్వంతోపాటు ఆత్మీయతానుబంధాలు పెనవేసుకోవడానికి నాందీవాచకం. అందుకే ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా, బంధుమిత్రుల సమక్షంలో జరుపుకుంటారు. కొందరు పవిత్ర పుణ్య క్షేత్రాల్లో తమ వివాహం జరుపుకుంటారు. ఇక ఆది దంపతులు శివపార్వతులు పెళ్లి చేసుకున్న చోటులోనే పెళ్లి చేసుకుంటే తమ జీవితాలు ఎంతో సౌభాగ్యవంతంగా సాగుతాయనే నమ్మకం చాలా మందికి ఉంటుంది.
డెహ్రాడూన్ : పెళ్లి అంటే నూరేళ్ల పంట. అనేక కుటుంబాల మధ్య బంధుత్వంతోపాటు ఆత్మీయతానుబంధాలు పెనవేసుకోవడానికి నాందీవాచకం. అందుకే ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా, బంధుమిత్రుల సమక్షంలో జరుపుకుంటారు. కొందరు పవిత్ర పుణ్య క్షేత్రాల్లో తమ వివాహం జరుపుకుంటారు. ఇక ఆది దంపతులు శివపార్వతులు పెళ్లి చేసుకున్న చోటులోనే పెళ్లి చేసుకుంటే తమ జీవితాలు ఎంతో సౌభాగ్యవంతంగా సాగుతాయనే నమ్మకం చాలా మందికి ఉంటుంది. అందుకే ఉత్తరాఖండ్‌లోని త్రియుగి గ్రామానికి కొత్త జంటలు పోటెత్తుతున్నాయి. ఇక్కడి త్రియుగినారాయణ్ దేవాలయంలో పెళ్లి చేసుకుని పవిత్ర భావాన్ని, సంతోషాన్ని మూటగట్టుకుని వెళ్తున్నారు.
బదరీ కేదార్ దేవాలయం కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యోగేంద్ర సింగ్ మాట్లాడుతూ, కొత్త జంటలు త్రియుగినారాయణ్ దేవాలయానికి వచ్చి పెళ్లి చేసుకుంటున్నారని చెప్పారు. పెళ్లి వేడుకల నిర్వహణకు అవసరమైన సదుపాయాలను కల్పించడం కోసం త్వరలోనే ఓ ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు.
ఉత్తరాఖండ్ తీర్థ్‌పురోహిత్ సమితి కార్యదర్శి సర్వేశ్వానంద్ సేమ్వాల్ మాట్లాడుతూ, ఈ ఏడాది మకర సంక్రాంతి నుంచి ఇప్పటి వరకు 50కిపైగా వివాహాలు ఇక్కడ జరిగాయని చెప్పారు. మే-జూన్ నెలల్లో 30 వివాహాలు జరిగాయని చెప్పారు. 2022లో 85 పెళ్లిళ్లు జరిగాయన్నారు. ఇక్కడ పెళ్లి చేసుకోవడం కోసం కొత్త జంటలు 2024 మార్చి వరకు బుక్ చేసుకున్నారని చెప్పారు.
ఇంత ప్రాధాన్యం ఎందుకు?
సత్యయుగంలో శివపార్వతులు అగ్ని సాక్షిగా త్రియుగినారాయణ్‌లోనే పెళ్లి చేసుకున్నారని సేమ్వాల్ చెప్పారు. ఇక్కడి యజ్ఞ కుండంలో అగ్ని ఇప్పటికీ ప్రజ్వరిల్లుతోందని, ఇది శాశ్వతంగా ఉంటుందని చెప్పారు. భక్తులు ఇక్కడికి వచ్చి యజ్ఞ కుండంలోని విబూదిని తీసుకెళ్తారని చెప్పారు. ఈ విబూదిని ధరిస్తే వైవాహిక జీవితం మరింత సంతోషంగా గడుస్తుందనే నమ్మకం ఉందన్నారు.
ఎలా వెళ్లాలి?
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో రుద్ర ప్రయాగ్ జిల్లాలో త్రియుగి గ్రామంలో త్రియుగినారాయణ్ దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో ప్రాచీన కాలంనాటి నీటి మడుగులు ఉన్నాయి.
ఇక్కడ పెళ్లి చేసుకున్న ప్రముఖుల్లో ఉన్నత విద్యా శాఖ మంత్రి డాక్టర్ ధన్ సింగ్ రావత్, ఆర్టిస్ట్ కవిత కౌశిక్, నికిత శర్మ, జితేంద్ర అసేడా, ఐపీఎస్ అధికారి అపర్ణ గౌతమ్, ఐఏఎస్ అధికారి లలిత్ మోహన్ రాయల్, ఎస్‌డీఎం జితేంద్ర వర్మ ఉన్నారు.
అర్చకుల నిరాశ
త్రియుగినారాయణ్ దేవాలయం వద్ద పెళ్లిళ్లు చేసుకోవడానికి అవసరమైన సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించకపోవడం పట్ల అర్చకులు నిరాశ వ్యక్తం చేశారు. ఐదేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలుకావడం లేదని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Chennai: మా మంత్రిని తొలగించేందుకు మీరెవరు?