Minister KTR: ‘మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం’... సీఐఐ సదస్సులో కేటీఆర్
ABN , First Publish Date - 2023-03-07T14:42:41+05:30 IST
"మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం.. మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తాం’’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్: "మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం.. మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తాం’’ అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మంగళవారం కాకతీయ హోటల్‌లో జరిగిన 2022-23 సీఐఐ రాష్ట్ర వార్షిక సమావేశం (2022-23 CII State Annual Conference) లో మంత్రి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. వ్యాపారులు, పెట్టుబడులకు రాష్ట్రంలో అద్భుతమైన వాతావరణం ఉందని తెలిపారు. ఇటీవల బయో ఏషియా( Bio Asia ) సదస్సు విజయవంతంగా నిర్వహించుకున్నామని చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 2013తో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు రెట్టింపు అయ్యాయని.. 2030 నాటికి 250 బిలియన్ డాలర్లు సాధించాలనే లక్ష్యంతో ఉన్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి ఎన్నో అనుకూలతలు, బలాలు ఉన్నాయన్నారు. 9 బిలియన్ టీకాలు హైదరాబాద్ (Hyderabad) లోనే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తయ్యే టీకాల్లో 50 శాతం ఇక్కడే అని మంత్రి అన్నారు.
ప్రపంచంలో అతిపెద్ద స్టెంట్ తయారీ కేంద్రం మన డివైజెస్ పార్కు తెలంగాణలో ఉందని అన్నారు. దేశానికే హైదరాబాద్ మొబిలిటీ కేంద్రంగా మారుతోందన్నారు. లైఫ్ సైన్సెస్‌తో పాటు టెక్నాలజీ రంగానికి హైదరాబాద్ అత్యుత్తమ వేదికగా మారిందని సదస్సులో తెలిపారు. ప్రైవేటు రంగంలో ఉపగ్రహాల తయారీ మొట్టమొదటగా హైదరాబాద్‌లోనే జరిగిందని గుర్తుచేశారు. డ్రోన్ల ద్వారా ఔషధాలు సరఫరా చేసే వినూత్న కార్యక్రమం చేపట్టామన్నారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని అన్నారు. ఈవీ, బ్యాటరీల తయారీ రంగంలో పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్నారు. కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని అన్నారు. ఫాక్స్‌కాన్ సంస్థకు 200 ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.