Delhi Excise Scam: సంజయ్‌సింగ్ జ్యూడిషియల్ కస్టడీ పొడిగింపు, సీఎంపై కుట్ర జరుగుతోందన్న ఎంపీ
ABN , First Publish Date - 2023-11-10T18:29:04+05:30 IST
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ జ్యుడిషియల్ కస్టడీని నవంబర్ 24 వరకూ స్థానిక కోర్టు శుక్రవారంనాడు పొడిగించింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (Delhi Excise policy) కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay Singh) జ్యుడిషియల్ కస్టడీని నవంబర్ 24 వరకూ స్థానిక కోర్టు శుక్రవారంనాడు పొడిగించింది. ఎంపీగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లపై సంజయ్ సింగ్ సంతకాలు చేసేందుకు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ అనుమతించారు. దీనితో పాటు పంజాబ్‌లో ఒక కేసుకు సంబంధించి అమృత్ సర్ కోర్టు నుంచి ప్రొడక్షన్ వారెంట్ ఉన్న విషయాన్ని కూడా పరిశీలించిన న్యాయమూర్తి. పంజాబ్ కోర్టు ముందు సంజయ్ సింగ్‌ను హాజరుపరచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు (ప్రస్తుతం రద్దయింది)కు సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో గత అక్టోబర్ 4న ఈడీ సంజయ్ సింగ్‌ను గంటల తరబడి ప్రశ్నించి అనంతరం అరెస్టు చేసింది. రద్దయిన ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో సంజయ్ సింగ్ కీలక పాత్ర పోషించారని, తద్వారా కొందరు లిక్కర్ తయారీదారులు, హోల్‌సైల్, రిటైలర్లు లాభపడ్డారని ఈడీ ఆరోపణగా ఉంది. ఈ కేసులో ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సైతం గత ఫిబ్రవరి నుంచి జైలులో ఉన్నారు.
కేజ్రీవాల్‌పై కుట్ర..!
కాగా, తమ బాస్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)పై కుట్ర జరుగుతోందని సంజయ్ సింగ్ సంచలన ఆరోపణ చేశారు. ''కేవలం అరెస్టు చేయడమే కాదు, కేజ్రీవాల్‌పై పెద్ద ప్లానే ఉంది'' అని కేంద్రంపై ఆయన పరోక్షంగా ఆరోపణలు చేశారు. ఎక్సైజ్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచిన అనంతరం సంజయ్ సింగ్ మీడియా ముందు ఈ సంచలన ఆరోపణలు చేశారు.