Covid: మళ్లీ ‘కరోనా’ కలకలం.. ఐదు మండలాల్లో అధికం

ABN , First Publish Date - 2023-04-12T11:06:17+05:30 IST

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (Greater Chennai Corporation) పరిధిలోని ఐదు మండలాల్లో కొత్త కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో ప్రజలు

Covid: మళ్లీ ‘కరోనా’ కలకలం.. ఐదు మండలాల్లో అధికం

పెరంబూర్‌(చెన్నై): గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (Greater Chennai Corporation) పరిధిలోని ఐదు మండలాల్లో కొత్త కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో మార్చి నుంచి ఎక్స్‌బీబీ, పీఏ2 రకం కొత్త కరోనా స్ట్రెయిన్‌ వ్యాప్తి క్రమక్రమంగా పెరుగుతోంది. వీటితో పాటు డెంగ్యూ, న్యుమోనియా జ్వరాల బాధితులకు కూడా మెరుగైన చికిత్సలు అందించాల్సి వస్తోంది. అదే సమయంలో బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తులు కొత్త కరోనా స్ట్రెయిన్‌ పట్ల జాగ్రత్తగా వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, జీసీసీ పరిధిలోని ఐదు మండలాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం లెక్కల ప్రకారం అన్నానగర్‌ మండలంలో 10, తేనాంపేటలో 14, కోడంబాక్కంలో 13, అడయార్‌లో 18, పెరుంగుడి మండలంలో 10 మందికి కరోనా లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. బాధితులు కనీసం ఐదు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే, హోం క్వారంటైన్‌లో ఉన్న బాధితులను కార్పొరేషన్‌ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వారు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కరోనా బాధితులున్న ప్రాంతాల్లో జనాభా సంఖ్య అధికంగా ఉందని, ఈ ప్రాంతాల్లో ఇతర వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టినట్లు కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు.

దుబాయ్‌ నుంచి కోవై వచ్చిన యువకుడికి కరోనా

ప్యారీస్‌(చెన్నై): దుబాయ్‌ నుంచి విమానంలో కోవైకు వచ్చిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా మహమ్మారి మళ్లీ చాప కింద నీరులా విజృంభిస్తోంది. ఇందువల్ల వివిధ దేశాల నుంచి విమానాల ద్వారా వస్తున్న ప్రయాణికులకు ఆయా విమానాశ్రయాల్లోనే కరోనా పరీక్షలు ప్రభుత్వం తీవ్రతరం చేసింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ అన్ని విమానాశ్రయాల్లో ర్యాండమ్‌ విధానంలో వైద్యపరీక్షలు నిర్వహించేలా సదుపాయాలు కల్పించింది. ఈ నేపథ్యంలో, షార్జా నుంచి ఈ నెల 9వ తేది విమానంలో కోవైకు వచ్చిన ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో అరియలూరుకు చెందిన 34 ఏళ్ల యువకుడికి కరోనా వైరస్‌ లక్షణాలున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ యువకుడిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అరియలూరు జిల్లా ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అరుణ ఉత్తర్వులు జారీచేశారు.

Updated Date - 2023-04-12T11:06:17+05:30 IST