Share News

Covid vaccines: ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌ కారణమా?.. ఐసీఎంఆర్ తాజా రిపోర్ట్

ABN , First Publish Date - 2023-11-21T13:41:04+05:30 IST

ఇటీవలి కాలంలో యువతలో నమోదవుతున్న ఆకస్మిక మరణాలతో కొవిడ్ వ్యాక్సిన్లకు ఎలాంటి సంబంధంలేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది.

Covid vaccines: ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌ కారణమా?.. ఐసీఎంఆర్ తాజా రిపోర్ట్

న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో యువతలో నమోదవుతున్న ఆకస్మిక మరణాలతో కొవిడ్ వ్యాక్సిన్లకు ఎలాంటి సంబంధంలేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. ‘సడెన్ డెత్’లకు కొవిడ్-19 వ్యాక్సిన్లు కారణం కాదని తాజాగా నిర్వహించిన సమగ్ర అధ్యయనంలో తేలిందని పేర్కొంది. వాస్తవానికి కొవిడ్-19 వ్యాక్సిన్ కనీసం ఒక్క డోసు తీసుకున్నా మరణాల రిస్క్ తగ్గుతుందని తెలిపింది.

దేశవ్యాప్తంగా 47 తృతీయ స్థాయి హాస్పిటల్స్‌ను పరిగణనలో తీసుకొని అక్టోబర్ 1, 2021 నుంచి మార్చి 31, 2023 వరకు ఈ అధ్యయనాన్ని చేపట్టామని ఐసీఎంఆర్ తెలిపింది. 18-45 ఏళ్ల వయసు గ్రూపుల వారిపై అధ్యయనాన్ని చేశామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో సహఅనుబంధ వ్యాధులు లేదా అకస్మాత్తుగా మృత్యువాతపడడాన్ని తాము గుర్తించలేదని, వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించారు. 729 కేసులు, 2,916 పర్యవేక్షణలను పరిశీలించగా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో అకస్మాత్తు మరణాల రిస్క్ తక్కువగా ఉన్నట్టు బయటపడిందని తెలిపింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఈ రిస్క్ మరింత తక్కువగా ఉందని వివరించింది. అయితే సింగిల్ డోసు ఈ స్థాయిలో రక్షణ ఇవ్వలేదని తేలినట్టు పేర్కొంది.


ఆకస్మిక మరణాలకు పలు కారణాలు..

కాగా దేశంలో ఆకస్మిక మరణాలు పలు కారణాల వల్ల ఉత్పన్నమవుతున్నాయని ఐసీఎంఆర్ పేర్కొంది. కొవిడ్ కారణంగా గతంలో ఆస్పత్రి పాలైన పరిస్థితులు, ఫ్యామిలీలో సడెన్ డెత్‌లు, మరణానికి 48 గంటల ముందు ఆల్కాహాలు తాగడం, మరణానికి 48 గంటల శారీరకంగా తీవ్రమైన శ్రమ వంటి కారణాలుగా ఉన్నాయని పేర్కొంది. మొత్తంగా చూస్తే ఆకస్మిక మరణాలకు వ్యక్తుల వ్యక్తిగత జీవిత విధానం, ఊహించని ఘటనలు కారణమవుతున్నాయని పేర్కొంది.

Updated Date - 2023-11-21T13:47:05+05:30 IST