Karnataka Assembly elections: వామ్మో.. ఇంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులా?
ABN , First Publish Date - 2023-04-09T21:40:35+05:30 IST
ఈ కేసుల్లో గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష పడితే మళ్లీ గెలిచినా అనర్హత వేటు తప్పదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
బెంగళూరు: కర్ణాటకలో 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయి. ఈ కేసుల్లో గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష పడితే మళ్లీ గెలిచినా అనర్హత వేటు తప్పదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 2018 శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే సమయంలోనే వీరు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పారు. ఐదేళ్లయినా ఈ క్రిమినల్ కేసులు కొలిక్కిరాలేదు. వీటిలో చాలా కేసులు వివిధ విచారణ దశల్లో ఉన్నాయి. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన వివరాల ప్రకారం బీజేపీకి చెందిన 22 మంది, కాంగ్రెస్ సభ్యులు ఐదుగురు, జేడీఎస్‌కు చెందిన నలుగురు, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. వారిలో కొందరికి ఈసారి బీజేపీ టికెట్లు దక్కడం అనుమానమేనని వినిపిస్తోంది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారిలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, మంత్రులు శ్రీరాములు, జేసీ మాధుస్వామి, కేసీ నారాయణగౌడ తదితరులు ఉన్నారు.
224మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 119మంది, కాంగ్రెస్‌కు 75 మంది, జేడీఎస్‌కు 28మంది సభ్యులుండగా 2సీట్లు ఖాళీగా ఉన్నాయి.
కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
కాంగ్రెస్ ఇప్పటికే 165 మందికి పైగా అభ్యర్థులను ప్రకటించగా జేడీఎస్ వంద మంది అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ సోమవారం జాబితా ప్రకటించే అవకాశం ఉంది.