Dalai Lama : టిబెటన్ల సత్తా చైనాకు తెలిసొచ్చింది : దలైలామా
ABN , First Publish Date - 2023-07-08T14:33:41+05:30 IST
టిబెటన్ల మనోబలం చాలా గొప్పదని చైనాకు తెలిసొచ్చిందని టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా (Dalai Lama) అన్నారు. టిబెటన్ల సమస్యల పరిష్కారం కోసం తనతో అధికారికంగా కానీ, అనధికారికంగా కానీ చర్చలు జరపాలని చైనా కోరుకుంటోందని, తాను చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధమేనని తెలిపారు. న్యూఢిల్లీ, లడఖ్‌లలో పర్యటించడానికి ముందు ఆయన ధర్మశాలలో విలేకర్లతో మాట్లాడారు.
ధర్మశాల (హిమాచల్ ప్రదేశ్) : టిబెటన్ల మనోబలం చాలా గొప్పదని చైనాకు తెలిసొచ్చిందని టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా (Dalai Lama) అన్నారు. టిబెటన్ల సమస్యల పరిష్కారం కోసం తనతో అధికారికంగా కానీ, అనధికారికంగా కానీ చర్చలు జరపాలని చైనా కోరుకుంటోందని, తాను చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధమేనని తెలిపారు. న్యూఢిల్లీ, లడఖ్‌లలో పర్యటించడానికి ముందు ఆయన ధర్మశాలలో విలేకర్లతో మాట్లాడారు.
చైనాతో చర్చలను పునరుద్ధరించాలని కోరుకుంటున్నారా? అని అడిగినపుడు దలైలామా సమాధానం చెప్తూ, ‘‘మేం స్వాతంత్ర్యం కోరుకోవడం లేదు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో కొనసాగాలని చాలా సంవత్సరాల క్రితమే నిర్ణయించుకున్నాం. ఇప్పుడు చైనా మారుతోంది. చైనీయులు అధికారికంగా కానీ, అనధికారికంగా కానీ నన్ను సంప్రదించాలని కోరుకుంటోంది’’ అని చెప్పారు. తాను టిబెట్‌లో జన్మించానని, తన పేరు దలైలామా అని, టిబెట్ లక్ష్యం కోసం కృషి చేయడంతోపాటు తాను చైతన్యశీలురందరి సంక్షేమం కోసం కృషి చేస్తున్నానని చెప్పారు. ఆశావాదాన్ని వదులుకోకుండా, దృఢ సంకల్పం ఆవిరైపోకుండా తాను చేయగలిగినదానిని చేశానని తెలిపారు.
తనకు ఎవరిపైనా కోపం లేదని, టిబెట్ పట్ల కఠిన వైఖరిగల చైనా నేతలపై కూడా తనకు కోపం లేదని చెప్పారు. నిజానికి చారిత్రకంగా చైనా బౌద్ధ దేశమని చెప్పారు. తాను చైనాలో పర్యటించినపుడు అనేక దేవాలయాలు, మఠాలను చూశానని చెప్పారు. టిబెట్ సంస్కృతి, మతానికి సంబంధించిన విజ్ఞానం వల్ల ప్రపంచం లబ్ధి పొందుతుందని చెప్పారు. అయితే తాను ఇతర మతాల సంప్రదాయాలను కూడా గౌరవిస్తానని చెప్పారు. ప్రేమ, కారుణ్యాలను పెంచుకోవాలని ఆయా మతాలు తమ అనుచరులకు చెప్తున్నాయన్నారు.
‘‘నాకు వస్తున్న స్వప్నాలలో కనిపిస్తున్న సంకేతాలు, ఇతర జోస్యాల ప్రకారం, నేను 100 ఏళ్లకన్నా ఎక్కువ వయసు వరకు జీవిస్తాను. ఇప్పటి వరకు నేను ఇతరులకు సేవ చేశాను, ఇకపై కూడా దానిని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. ఈ ప్రాతిపదికపై నా ఆయురారోగ్యాల కోసం ప్రార్థించండి’’ అని దలైలామా కోరారు.
దలైలామా 88వ జన్మదినోత్సవాలు జూలై 6న ధర్మశాలలో జరిగాయి. ఆ రోజు ఆయన అక్కడి ప్రధాన టిబెటన్ టెంపుల్ ప్రాంగణంలోకి వెళ్లారు. దీనికి సమీపంలోనే ఆయన నివాసం ఉంది.
ఇవి కూడా చదవండి :
Rahul Gandhi : పొలంలో దిగి, నాట్లు వేసి, రైతులతో ఆత్మీయంగా మాట్లాడిన రాహుల్ గాంధీ