Share News

MP Danish Ali: పార్లమెంటు సభ్యుడు డేనిష్ అలీకి బీఎస్‌పీ బిగ్ షాక్..

ABN , First Publish Date - 2023-12-09T18:13:42+05:30 IST

పార్లమెంటులో బీజేపీ ఎంపీతో నెలరోజుల క్రితం వాగ్దుద్ధానికి దిగి ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ డానిష్ అలీకి సొంత పార్టీ నుంచే చుక్కెదురైంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే కారణంగా ఆయనను బీఎస్‌పీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు బీఎస్‌పీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

MP Danish Ali: పార్లమెంటు సభ్యుడు డేనిష్ అలీకి బీఎస్‌పీ బిగ్ షాక్..

న్యూఢిల్లీ: పార్లమెంటులో బీజేపీ ఎంపీతో నెలరోజుల క్రితం వాగ్దుద్ధానికి దిగి ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ఎంపీ డానిష్ అలీ (Danish Ali)కి సొంత పార్టీ నుంచే చుక్కెదురైంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే కారణంగా ఆయనను బీఎస్‌పీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు బీఎస్‌పీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.


డేనిష్ అలీని ఉద్దేశించినట్టుగా ఉన్న ఆ ప్రకటనలో...''పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరాదని గతంలో చాలా స్పష్టంగా తెలియజేశాం. పార్టీ నిబంధనలకు అనుగుణంగా మీరు నడుచుకుంటారని దేవెగౌడ గట్టిగా చెప్పడంతో మీకు పార్టీ టిక్కెట్ ఇచ్చాం. అయితే, పార్టీలో చేరినప్పుడు మీరు చేసిన వాగ్దానాన్ని మరిచిపోయినట్టు కనిపిస్తోంది. ఆ కారణంగా మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం'' అని ఆ ప్రకటన తెలిపింది. అయితే ఎంపీ సస్పెన్షన్‌కు ఇతమిత్ధమైన కారణం ఏమిటనేది ఆ ప్రకటనలో తెలియజేయలేదు.


కాగా, గత పార్లమెంటు సమావేశాల్లో డేనిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, దీనిపై పార్టీలకు అతీతంగా పలువురు అభ్యంతరం తెలపడం సంచలనమైంది. స్పీకర్ సైతం రమేష్ బిధూరిని మందిలిస్తూ రికార్డుల నుంచి ఆయన చేసిన వ్యాఖ్యలను తొలగించాలని ఆదేశించారు. బీజేపీ నాయకత్వం సైతం రమేష్ బిదూరికి నోటీసు ఇచ్చింది. ఈ క్రమంలో డేనిష్ అలీ పలువురు ప్రతిపక్ష నేతలను సంప్రదించడం, లోక్‌సభ నుంచి టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రీని శుక్రవారం సస్పెండ్ చేయడంతో పార్లమెంటు వెలుపల జరిగిన సంఘీభావ నిరసనలో డేనిష్ అలీ పాల్గొనడం బీఎస్‌పీ ఆగ్రహానికి కారణం కావచ్చని భావిస్తున్నారు.

Updated Date - 2023-12-09T18:13:43+05:30 IST