Share News

DCM warning: డిప్యూటీ సీఎం హెచ్చరిక.. లక్ష్మణ రేఖ దాటినవారికి నోటీసులు తథ్యం

ABN , First Publish Date - 2023-11-04T11:41:12+05:30 IST

అధిష్టానం స్పష్టమైన సూచనలు చేసినప్పటికీ బహిరంగ వేదికలపై రకరకాల వ్యాఖ్యలు

DCM warning: డిప్యూటీ సీఎం హెచ్చరిక.. లక్ష్మణ రేఖ దాటినవారికి నోటీసులు తథ్యం

- కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ హెచ్చరిక

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): అధిష్టానం స్పష్టమైన సూచనలు చేసినప్పటికీ బహిరంగ వేదికలపై రకరకాల వ్యాఖ్యలు చేస్తూ పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వాతావరణం సృష్టిస్తున్న నేతలందరికీ నోటీసులు జారీ చేయనున్నట్టు కేపీసీసీ అధ్యక్షుడు కూడా అయిన ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) ప్రకటించారు. హుబ్బళ్లిలోని ప్రభుత్వ అతిథిగృహంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఐదేళ్లు పాలించేందుకు కాంగ్రెస్‏కు అధికారమిచ్చారని, ముఖ్యమంత్రి, మంత్రులుగా ఎవరు ఉండాలనో అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. అధిష్టానం సూచన మేరకు రాష్ట్రంలో సిద్దరామయ్య నాయకత్వంలోని ప్రభుత్వం పగ్గాలు చేపట్టిందని తెలిపారు. ఐదేళ్లు తానే సీఎం అంటూ సిద్దరామయ్య చేసిన ప్రకటనపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ఒక క్రమశిక్షణ కల్గిన కార్యకర్తగా పార్టీ అంతర్గత వ్యవహారాలపై తాను బహిరంగంగా మాట్లాడబోనని అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఏమైనా మాట్లాడదలచుకుంటే సీఎల్పీ సమావేశంలోగానీ, పార్టీ అంతర్గత సమావేశాల్లోగానీ చర్చించాలని అందుకు తమ అభ్యంతరం ఏమీ ఉండదన్నారు. ఎవరెవరికి నోటీసులు జారీ చేస్తారనే అంశంపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు.

ముఖ్యమంత్రి పదవికి సంబంధించి ఎవరూ నోరు విప్పరాదంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీ్‌పసింగ్‌ సుర్జేవాలా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాల అనంతరం ఐదేళ్లు తానే సీఎం అని సిద్దరామయ్య ప్రకటించగా ముఖ్యమంత్రి పదవి రేసులో తాను ఉన్నానంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడైన మంత్రి ప్రియాంక ఖర్గే శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి రాజణ్ణ కూడా సీఎం పదవిపై వ్యాఖ్యానిస్తూ ఒకవేళ సిద్దరామయ్య ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి వస్తే తదుపరి ఈ స్థానానికి హోం మంత్రి డాక్టర్‌ జి. పరమేశ్వర్‌ పేరును పరిశీలించాలని అధిష్టానం పెద్దలను కోరతానన్నారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ జోక్యం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Updated Date - 2023-11-04T11:41:14+05:30 IST