Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం
ABN , First Publish Date - 2023-03-17T16:03:12+05:30 IST
ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం విధానం కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్టయిన మనీష్ సిసోడియా..
న్యూఢిల్లీ: ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం విధానం (Delhi Liquor Policy) కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్టయిన మనీష్ సిసోడియా (Manish Sisodia)ను రౌస్ అవెన్యూ కోర్టు ముందు శుక్రవారంనాడు హాజరుపరిచారు. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగు చూసాయని, ఆయన కస్టడీని మరో 7 రోజులు పొడిగించాలని ఈడీ కోరింది. ఇరువైపు వాదనలు విన్న కోర్టు ఐదు రోజులపాటు సిసోడియా కస్టడీని పొడిగించింది.
సిసోడియా ఈమెయిల్స్, మొబైల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్ విశ్లేషణకు పంపామని, సిసోడియా కస్టడీలో కీలక సమాచారం వెలుగుచూస్తోందని ఈడీ కోర్టుకు తెలియజేసింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఫిర్యాదు రిసీవ్ అయిన జూలై 22వ తేదీన సిసోడియా తన మొబైల్ ఫోన్ మార్చారని, ఆ ఫోనుతో సిసోడియా ఏమి చేశారనేది తాము వెల్లడించలేమని తెలిపింది. 2021 మార్చిలో సిసోడియా కంప్యూటర్ నుంచి కనుగొన్న డాక్యుమెంట్‌లో 5 శాతం కమిషన్ ప్రస్తావన ఉందని, అది 2022 సెప్టెంబర్‌లో 12 శాతానికి పెరిగిందని, సౌత్ లాబీ తరఫునే ఇది జరిగిందని ఈడీ కోర్టుకు తెలిపింది.
కొత్తగా చెప్పిందేమీ లేదు...
కాగా, సిసోడియా న్యాయవాది తన వాదన వినిపిస్తూ, సిబీఈ, ఈడీ చెప్పినవే చెబుతున్నాయని, కొత్త విషయాలేవీ చెప్పడం లేదని అన్నారు. గత ఏడు రోజుల్లో సిసోడియాను 12 నుంచి 13 గంటలు మాత్రమే ప్రశ్నించారని కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే, ఈసీ ఇందుకు భిన్నంగా ప్రతిరోజూ 5 నుంచి 6 గంటలు ఆయనను ప్రశ్నించామని, గురువారం కూడా ఆరు గంటలు ప్రశ్నించామని, సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉందని తెలిపింది.
కాగా, సిసోడియో జ్యుడిషియల్ కస్టడీ మార్చి 20వ తేదీ వరకూ ఉండగా, ఈ కేసులోనే ఈడీ హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అరుణ్ రామచంద్రన్ పిళ్లైని ఇంతకుముందు కస్టడీలోకి తీసుకుంది. భారతీయ రాష్ట్రీయ సమితి (BRS) ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుమార్తె కె.కవితను మార్చి 11న ఈడీ ప్రశ్నించింది. అయితే గురువారంనాడు ఈడీ విచారణకు ఆమె గైర్హాజరయ్యారు. దీంతో మార్చి 20వ తేదీన హాజరుకావాలంటూ తాజా సమన్లను ఈడీ జారీ చేసింది. తాను మహిళను అయినందున నిబంధనల ప్రకారం ఈడీ కార్యాలయంలో ప్రశ్నించేందుకు సమన్లు పంపరాదని, తన నివాసంలో విచారణ జరవచ్చునని ఆమె పేర్కొంటూ తక్షణం దీనిపై విచారణ జరపాలని సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు.