Compulsory Voting: ఢిల్లీ హైకోర్టు ఏమి చెప్పిందంటే..?
ABN , First Publish Date - 2023-03-17T16:58:11+05:30 IST
పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ తప్పనిసరి చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని..
న్యూఢిల్లీ: పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో (Parliament And Assembly Elections) ఓటింగ్ తప్పనిసరి చేయాలని (Compulsory voting) కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని (PIL) ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) శుక్రవారంనాడు తోసిపుచ్చింది. ఓటు వేయడం అనేది ఐచ్ఛికమని (Matter of choice), న్యాయవ్యవస్థ అలాంటి ఆదేశాలు జారీ చేయలేదని కోర్టు స్పష్టం చేసింది. భారతదేశంలోని అర్హులైన పౌరులకు ఓటు అనేది వారి హక్కు అని, అది ఐచ్ఛికమని కోర్టు చెప్పడంతో పిటిషనర్ తన పిల్ ఉపసంహరించుకున్నారు.
ప్రాక్టీసింగ్ అడ్వకేట్, బీజేపీ నేత అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ ఈ పిల్ వేశారు. ఓటింగ్ తప్పనిసరి చేస్తూ నివేదకను సిద్ధం చేయాల్సిందిగా లా కమిషన్‌ను ఆదేశించాలని కూడా కోర్టును పిటిషనర్ కోరారు. పోలింగ్ శాతం అనేది ఇండియాను వేధిస్తున్న సమస్య అని అన్నారు. ఓటింగ్‌ను తప్పనిసరి చేయడం వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందని, ముఖ్యంగా అట్టడుగు వర్గాలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇది మరింత ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. ప్రతి పౌరుడు తన గళం వినిపించాలని, ప్రజాభీష్టానికి ప్రతినిధగా ప్రభుత్వం ఉండాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొనారు.
తప్పనిసరి ఓటింగ్‌ను ఆస్ట్రేలియా, బెల్జియం, బ్రెజిల్ వంటి దేశాలు విజయవంతంగా అమలు చేశాయని పిటిషనర్ చెప్పారు. ఈ దేశాల్లో గణనీయంగా ఓటింగ్ శాతం పెరిగిందని, ప్రజాస్వామ్య నాణ్యతా ప్రమాణాలు మెరుగయ్యాయని అన్నారు. 326వ అధికరణ కింద ఓటును ప్రాథమిక హక్కుగా రాజ్యాంగం గుర్తించిందని, ప్రజాస్వామ్యం పనితీరు సక్రమంగా కొనసాగేలా సహేతుక ఆంక్షలు విధించడం ద్వారా తప్పనిసరి ఓటింగ్‌ను అమలుచేయవచ్చని పిటిషనర్ పేర్కొన్నారు.