Kejriwal Vs Delhi LG : లెఫ్టినెంట్ గవర్నర్ ఇలాంటి సమాధానం చెబుతారని కేజ్రీవాల్ ఊహించి ఉండరు!
ABN , First Publish Date - 2023-01-20T16:12:48+05:30 IST
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా (Vinai Kumar Saxena) మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ‘‘లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఆయన ఏమైనా హెడ్‌మాస్టరా?’’ అని ప్రశ్నించిన కేజ్రీవాల్‌కు సక్సేనా శుక్రవారం రాసిన లేఖలో చాలా ఘాటుగా సమాధానం చెప్పారు.
కేజ్రీవాల్, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia), ఇతర ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) నేతలు సోమవారం ఎల్‌జీ సక్సేనా కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఎల్‌జీపై విమర్శలు గుప్పిస్తూ, ఆయనేమైనా నాకు హెడ్‌మాస్టరా? అని ప్రశ్నించారు. ఆయన ఈ వ్యాఖ్యలను మరుసటి రోజైన మంగళవారం ఢిల్లీ శాసన సభలో కూడా పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. ‘‘ఎల్‌జీ ఎవరు? ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? నేను ముఖ్యమంత్రిని, దేశ రాజధాని నగరంలోని 2 కోట్ల మందికి పైగా నన్ను ఎన్నుకున్నారు’’ అని కేజ్రీవాల్ అన్నారు.
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ను ఉద్దేశించి సక్సేనా రాసిన లేఖలో, ‘‘శాసన సభ లోపల, వెలుపల మీరు చాలా వ్యాఖ్యలు చేశారు. వాటిలో ప్రతిదీ తప్పుదోవ పట్టించేదే, అవాస్తవమైనదే, అవమానకరమైనదే’’నని పేర్కొన్నారు. ‘‘ఎల్‌జీ ఎవరు? ఆయన ఎక్కడి నుంచి వచ్చారు?’’ అనే ప్రశ్నలకు సమాధానాలు భారత రాజ్యాంగాన్ని చూస్తే తెలుస్తాయన్నారు. మిగిలిన వ్యాఖ్యలు చాలా దిగజారిన స్థాయిలో ఉన్నాయి కాబట్టి, సమాధానాలు చెప్పేందుకు అవి తగినవి కాదన్నారు.
‘‘మీరు నా హెడ్మాస్టర్ కాదు’’ అని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యపై సక్సేనా స్పందిస్తూ, ‘‘కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకురావడం సరైనదని భావిస్తున్నాను. ఎదురుగా ఉన్న సమస్యలను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి, వాస్తవమైన, సమగ్రమైన పద్ధతిలో వాటిని పరిష్కరించడానికి దోహదపడటం కోసం వాటిని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. అలా చేయడంలో నేను ఓ ‘హెడ్మాస్టర్’గా వ్యవహరించబోను, వినయపూర్వక, బలమైన ప్రజాగళంగా వ్యవహరిస్తాను’’ అని తెలిపారు.
ఎల్‌జీ సక్సేనాను కలిసేందుకు తనకు అవకాశం ఇవ్వడంలేదని కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై కూడా ఈ లేఖలో సక్సేనా స్పందించారు. ఈ వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమని స్పష్టం చేశారు. ‘‘నన్ను కలిసేందుకు మిమ్మల్ని, ఉప ముఖ్యమంత్రిని ఆహ్వానించాను. మిమ్మల్ని కలవడం, మీకు భోజనం వడ్డించడం నాకు చాలా ఇష్టం. కానీ మీ ఎమ్మెల్యేలందరినీ కలవాలనే సాకు చూపించి, మీరు నన్ను కలవడానికి రావడం మానేశారు. అతి తక్కువ సమయంలో, అకస్మాత్తుగా మీరు చేసిన డిమాండ్‌కు అనుగుణంగా 70-80 మందిని కలవడం సాధ్యం కాదని మీకు తెలుసు’’ అని పేర్కొన్నారు.