G20 Summit : జీ20 సదస్సుకు భారీ సన్నాహాలు.. ఎక్కడ చూసినా కొండముచ్చుల భారీ కటౌట్లు..

ABN , First Publish Date - 2023-08-30T16:40:38+05:30 IST

దేశ రాజధాని నగరం జీ20 సదస్సుకు వడివడిగా తయారవుతోంది. వివిధ దేశాధినేతలు, అధికారుల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి భారీ కొండముచ్చుల బొమ్మలతో కూడిన కటౌట్లు స్వాగతం పలుకబోతున్నాయి. వినే అవకాశం ఉంటే కొండముచ్చులు చేసే శబ్దాలను కూడా వినవచ్చు.

G20 Summit : జీ20 సదస్సుకు భారీ సన్నాహాలు.. ఎక్కడ చూసినా కొండముచ్చుల భారీ కటౌట్లు..

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం జీ20 సదస్సుకు వడివడిగా తయారవుతోంది. వివిధ దేశాధినేతలు, అధికారుల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి భారీ కొండముచ్చుల బొమ్మలతో కూడిన కటౌట్లు స్వాగతం పలుకబోతున్నాయి. వినే అవకాశం ఉంటే కొండముచ్చులు చేసే శబ్దాలను కూడా వినవచ్చు. కోతుల బెడద నుంచి తప్పించుకోవడం కోసమే అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు.

జీ20 సదస్సు సెప్టెంబరు 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ సదస్సుకు ఈ సంవత్సరం భారత దేశం అధ్యక్షత వహిస్తోంది. ఇప్పటికే అనేక ఇతివృత్తాలతో మంత్రుల స్థాయిలో సమావేశాలు జరిగాయి ఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరిగే సదస్సు కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కూడా నగరాన్ని సుందరీకరించడం కోసం కృషి చేస్తోంది.

నగరంలో కోతుల బెడద నుంచి తప్పించుకోవడం కోసం కొండముచ్చుల బొమ్మలతో కటౌట్లను ఏర్పాటు చేశారు. ఇవి సజీవంగా ఉన్నట్లే కనిపిస్తున్నాయి. రోడ్లపైనా, జీ20 సదస్సు జరిగే వేదికల వద్ద వీటిని ఉంచారు. కొండముచ్చులు చేసే శబ్దాలు చేయడంలో శిక్షణ పొందిన 40 మందిని కూడా నియమించబోతున్నట్లు అధికారులు తెలిపారు.


కోతుల బెడద ఉన్న నగరాల్లో కొండముచ్చులను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. కొండముచ్చులను చూస్తే కోతులు పారిపోతాయి. న్యూఢిల్లీ నగర పాలక సంస్థ ఉపాధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ మాట్లాడుతూ, ఢిల్లీలోని అటవీ ప్రాంతం నుంచి కోతులు జీ20 వేదికల వద్దకు రాకుండా నిరోధించేందుకు ఢిల్లీ అటవీ శాఖ సహకారంతో తాత్కాలికంగా ఈ చర్యలను చేపడుతున్నామని చెప్పారు. దేశాధినేతల వాహనాల శ్రేణికి కోతులు అడ్డుపడకుండా నిరోధించడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రయోగాత్మకంగా కటౌట్లను పెట్టామని, వీటి వల్ల ఫలితం ఎంత వరకు ఉంటుందో చూడాలని చెప్పారు.

ఢిల్లీలోని సెంట్రల్ రిడ్జ్‌ ప్రాంతంలో 864 హెక్టార్ల మేరకు అటవీ ప్రాంతం ఉంది. దీనిని 1914లో రిజర్వు ఫారెస్టుగా మార్చారు.


ఇవి కూడా చదవండి :

BJP : యోగి ఆదిత్యనాథ్‌పై వరుణ్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు

Modi Vs Rahul Gandhi : భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది.. మోదీ అబద్ధాలు చెప్తున్నారు.. : రాహుల్ గాంధీ

Updated Date - 2023-08-30T16:40:38+05:30 IST