Delhi:ఎన్‌సీఆర్ పరిధిలో క్రాకర్స్ నిషేధించాలని కేంద్రాన్ని కోరిన ఢిల్లీ ప్రభుత్వం
ABN , First Publish Date - 2023-10-21T11:11:25+05:30 IST
నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో క్రాకర్స్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీపావళి సందర్భంగా ఏర్పడే వాయు కాలుష్యాన్ని అరికట్టడమే ధ్యేయంగా ఢిల్లీ, పంజాబ్, హరియాణా, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల పర్యావరణ శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్(Bhupender Yadav) ఇవాళ సమావేశం నిర్వహించారు.
ఢిల్లీ: నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో క్రాకర్స్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీపావళి సందర్భంగా ఏర్పడే వాయు కాలుష్యాన్ని అరికట్టడమే ధ్యేయంగా ఢిల్లీ, పంజాబ్, హరియాణా, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల పర్యావరణ శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్(Bhupender Yadav) ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఢిల్లీ(Delhi) మంత్రి గోపాల్ రాయ్ మాట్లాగుతూ.. దేశ రాజధాని పరిసరాల్లో కాలుష్యాన్ని అరికట్టడంలో భాగంగా క్రాకర్స్ పై, డీజిల్ తో నడిచే బస్సులపై నిషేధం విధించాలని కోరారు. చలికాలంలో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. ఎన్ సీఆర్ పరిధిలోని ప్రాంతాల్లో కాలుష్యాన్ని అరికట్టడానికి ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ఇండిపెండెంట్ ఎన్విరాన్మెంటల్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (CSE) నివేదిక ప్రకారం, ఢిల్లీలో ఏర్పడుతున్న కాలుష్యంలో 31 శాతం రాజధానిలోని పలు ప్రాంతాల నుంచి ఏర్పడగా, 69 శాతం ఎన్ సీఆర్ రాష్ట్రాల నుంచే వస్తోంది. ఎన్ సీఆర్ పరిధిలోకి వచ్చే రాష్ట్రాల్లో పొల్యూషన్ ని కంట్రోల్(Pollution Control) చేయకపోతే ఢిల్లీలో పరిస్థితి మారదని రాయ్ అన్నారు. బాణసంచా, చెత్తను కాల్చడాన్ని పూర్తిగా నిషేధించాలని.. సీఎన్‌జీ(CNG), ఎలక్ట్రిక్ వాహనాలను(EV) మాత్రమే వాడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమల్లో కాలుష్య ఇంధనాలను ఫైన్డ్ నేచురల్ గ్యాస్ గా మార్చాలని, ఇటుక బట్టీల పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి జిగ్ జాగ్ టెక్నాలజీ ఉపయోగించాలని.. డీజిల్ జనరేటర్లపై ఆధారపడకుండా ఎన్ సీఆర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ అందుబాటులో ఉంచాలని కోరారు.
అవగాహన కార్యక్రమాలు
కాలుష్య నియంత్రణే ధ్యేయంగా శుక్రవారం ఢిల్లీలో 'రన్ అగైనెస్ట్ పొల్యూషన్' కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలో వాహన కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి 'రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్' ప్రచారాన్ని మళ్లీ ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. బాణసంచా ద్వారా ఏర్పడే కాల్చడాన్ని తగ్గించేందుకు 'పటాకే నహీ.. దియే జలావో' అనే ప్రజా చైతన్య ప్రచారాన్ని మళ్లీ ప్రవేశపెట్టబోతోంది. శీతాకాలంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కేజ్రీవాల్ సర్కార్ 15-పాయింట్ల యాక్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది కూడా పకడ్బందీ చర్యలు చేపట్టాలని భావిస్తోంది.