Air India: ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో విమానంలో సాంకేతిక లోపం, రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ABN , First Publish Date - 2023-06-06T19:09:26+05:30 IST
ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఇంజన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రష్యాకు మళ్లించారు. రష్యాలోని మాగదన్ విమానాశ్రయంలో సురక్షితంగా విమానం ల్యాండ్ అయినట్టు ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో (Delhi-San Francisco) బయలుదేరిన ఎయిర్ ఇండియా (Air India) విమానం ఇంజన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రష్యాకు (Russia) మళ్లించారు. రష్యాలోని మాగదన్ విమానాశ్రయంలో సురక్షితంగా విమానం ల్యాండ్ అయినట్టు ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నట్టు తెలిపారు.
సంఘటన వివరాల ప్రకారం, ఎయిర్ ఇండియా బోయింగ్ 777-200(reg.VT-ALH) విమానం న్యూఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రిన్సిస్కో బయలుదేరింది. ఈ క్రమంలో విమానం ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్టు గుర్తించారు. దీంతో వెంటనే విమానాన్ని రష్యా వైపు మళ్లించాలని నిర్ణయించారు. మాగదన్ విమానాశ్రయంలో సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులకు అవసరమైన వసతి సౌకర్యాలతో పాటు గమ్యస్థానాలకు పంపించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తు్న్నట్టు ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. విమానానికి అవసరమైన అత్యవసర పరీక్షలు నిర్వహిస్తు్న్నట్టు చెప్పారు.