Deputy CM: ఆర్థికశాఖ నిపుణులతో చర్చించాకే.. మేఘమథనంపై నిర్ణయం
ABN , First Publish Date - 2023-12-09T12:47:09+05:30 IST
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్ర కరువు ఏర్పడిందని, వేలాది ఎకరాల్లో పంటనష్టం సంభవించిందని
- ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్ర కరువు ఏర్పడిందని, వేలాది ఎకరాల్లో పంటనష్టం సంభవించిందని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) పేర్కొన్నారు. శుక్రవారం బెళగావి సువర్ణసౌధలో జీరో అవర్‌లో కాంగ్రెస్ సభ్యుడు ప్రకాశ్ కోళివాడ్ లేవనెత్తిన అంశంపై ఆయన బదులిచ్చారు. కరువు పరిస్థితి నేపథ్యంలో తుంగభద్ర ఆనకట్ట కిందిభాగం రైతుల పంటపొలాలకు నీరు అందించాలని మంత్రి శివరాజ్ తంగడగికి తాను విజ్ఞప్తి చేయగా, రిజర్వాయర్‌లో ఇన్‌ఫ్లో పెరిగితేనే విడుదల చేస్తామని చెప్పారని సభ్యుడు ప్రకాశ్ కోళివాడ్ సభకు తెలిపారు. దీనిపై ఉపముఖ్యమంత్రి బదులిస్తూ వాతావరణశాఖ అధికారులతోనూ, శాస్త్రవేత్తలతోనూ తాము చర్చలు జరుపుతున్నామని రానున్న నాలుగు రోజుల్లో ఒకమోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం లభించిందన్నారు. ఒకవేళ వర్షాలు కురవని పక్షంలో ఆర్థికశాఖ నిపుణులతో చర్చించి అవసరమైన తాలూకాల్లో మేఘమథనం జరిపే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అయితే ఇది ఒకింత వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారమని, పైగా ఫలితాలు నిక్కచ్చిగా ఉంటాయన్న గ్యారెంటీ లేదన్నారు. అయినప్పటికీ రైతుల కోసం పంటపొలాలను కాపాడేందుకు మేఘమథనం జరిపేందుకు సిద్ధమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో తాలూకాలో మేఘమథనం జరిపేందుకు ఒక కోటి రూపాయల వరకు ఖర్చు కాగలదని అంచనా వేస్తున్నామని తెలిపారు. కాగా రాజకీయ లబ్ధికోసమే బీజేపీ తప్పుడు కథనాలను ప్రచారం చేస్తోందని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. బెళగావిలో బీజేపీ నేత పృథ్వీసింగ్‌పై దాడి వ్యవహారం బీజేపీ సృష్టించినది కట్టుకథ అన్నారు. ఇలా కట్టుకథలు అల్లి ప్రజలను నమ్మించడంలో బీజేపీ నేతలు నిష్ణాతులని ఆరోపించారు.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ బిల్లుకు ఆమోదం
కర్ణాటక స్టాంప్స్ (సవరణ)-2023 బిల్లును శాసనసభ గురువారం ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం ట్రస్టుల రిజిస్ట్రేషన్, లీజులు, అగ్రిమెంట్లు, రుణ పత్రాల రిజిస్ట్రేషన్ చార్జీలు భారీగా పెరగనున్నాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్ మినహా దాదాపు 54 రకాల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచేందుకు ఈ బిల్లు వెసులుబాటు కల్పించనుంది. సాధారణ ఆస్తుల క్రయవిక్రయాలపై స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ ఫీజుల్లో ఎలాంటి మార్పు ఉండదని, సంబంధిత శాఖ ఉన్నతాధికారి ఒకరు నగరంలో శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.