Kumaraswamy: మీ సపోర్ట్ పాకిస్థాన్‌కా? ఆస్ట్రేలియాకా?: సిద్ధరామయ్యను ప్రశ్నించిన హెచ్‌డీ
ABN , First Publish Date - 2023-10-21T17:41:31+05:30 IST
ఆస్ట్రేలియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ ను తిలకించేందుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి వెళ్లిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై జనతాదళ్ (సెక్యులర్) నేత హెచ్‌డీ కుమారస్వామి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అనేక కీలక సమస్యలు ఉండగా ప్రభుత్వం క్రికెట్ మ్యాచ్ చూస్తోందని తప్పుపట్టారు.
బెంగళూరు: ఆస్ట్రేలియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ (Austraila-pakistan cricket match)ను తిలకించేందుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి వెళ్లిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై జనతాదళ్ (సెక్యులర్) నేత హెచ్‌డీ కుమారస్వామి (HD Kumara swamy) విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అనేక కీలక సమస్యలు ఉండగా ప్రభుత్వం క్రికెట్ మ్యాచ్ చూస్తోందని తప్పుపట్టారు.
''ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు నిన్న క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వెళ్లారు. అది ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అయితే మంచిదే. కానీ ఆ మ్యాచ్ పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది. వాళ్లు పాకిస్థాన్‌కు సపోర్ట్ ఇస్తారా? ఆస్ట్రేలియాకా? రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. ప్రభుత్వం మాత్రం క్రికెట్ మ్యాచ్ చూస్తోంది'' అని శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ కుమారస్వామి వ్యాఖ్యానించారు. ప్రజలు తమకు అధికారం ఇచ్చారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, ప్రజలేమో ప్రభుత్వంలో పర్సంటేజ్‌లు, అవినీతి గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ మాత్రం తాము ఏది చెప్పామో అదే చేస్తున్నామని అంటోందని, రైతులు మాత్రం ఇబ్బందులపాలవుతున్నారని చెప్పారు. కేంద్రానికి నిధుల కోసం లేఖ రాశామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కలవాలని ఆయన అన్నారు. కొన్ని జిల్లాలో నీటి కొరత ఉందని, రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పలు ప్రాంతాల్లో భారీగా పంటనష్టాలు, నాణ్యతా సమస్యలు తలెత్తాయని చెప్పారు. ప్రభుత్వంలో సమన్వయ లోపం కనిపిస్తోందని తప్పుపట్టారు.