Digvijaya Singh: నుహ్ తరహా అల్లర్లకు బీజేపీ ప్లాన్... మాజీ సీఎం సంచలన ఆరోపణ
ABN , First Publish Date - 2023-08-19T18:37:22+05:30 IST
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలోని నుహ్ తరహాలో మధ్యప్రదేశ్‌లో కూడా మతపరమైన అల్లర్లను సృష్టించేందుకు భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేస్తోందని ఆరోపించారు.
భోపాల్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ వేడిని మరింత పెంచుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijaya Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలోని నుహ్ తరహాలో మధ్యప్రదేశ్‌లో కూడా మతపరమైన అల్లర్లను సృష్టించేందుకు భారతీయ జనతా పార్టీ (BJP) ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. భోపాల్‌లోని బీఎస్ఎస్ కాలేజీలో న్యాయవాదుల కోసం ఏర్పాటు చేసిన 'వైదిక్ విమర్శ్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, హర్యానాలోని నుహ్‌లో అల్లర్లకు రూపకల్పన చేసిన తరహాలోనే మధ్యప్రదేశ్‌లోనూ అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ యోచన చేస్తున్నట్టు తనకు తెలిసిందని చెప్పారు. ఒక కచ్చితమైన వ్యూహంతో అల్లర్లను ప్రోత్సహించేందుకు వ్యూహం జరుగుతున్నట్టు కనిపిస్తోందని, ప్రజలు తమ పట్ల అసంతృప్తితో ఉన్నారని బీజేపీ గుర్తించిందని అన్నారు.
మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం..
కాంగ్రెస్‌కు మద్దతుగా 2018లో లాయర్లు ర్యాలీల్లో పాల్గొన్నారని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని దిగ్విజయ్ సింగ్ అన్నారు. మరోసారి లాయర్లు తమకు మద్దతుగా ఉన్నారని, ఈసారి కూడా పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే నమ్మకం ఉందని అన్నారు. రాష్ట్రంలో అవినీతికి హద్దుల్లేకుండా పోయిందని అధికార బీజేపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. కాగా, దీనికి ముందు మధ్యప్రదేశ్‌లో భజరంగ్ దళ్ సంస్థను నిషేధించమని, అందులోనూ కొందరు మంచి వ్యక్తులు ఉండవచ్చని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. అయితే, అల్లర్లు, అలజడులకు కారణమైన వారిని మాత్రం విడిచిపెట్టేది లేదని ఆయన అన్నారు.
2018 ఎన్నికల్లో..
మధ్యప్రదేశ్‌లో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 2020 మార్చిలో జ్యోతిరాదిత్య సింధియా సహా 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. 2020 మార్చి 23న బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.