Ajit Pawar: ముగ్గురు పిల్లలుంటే అనర్హత వేటు... అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-04-24T14:42:26+05:30 IST

మహారాష్ట్ర సీఎం పదవి కోసం 2024 అసెంబ్లీ ఎన్నికల వరకూ వేచి ఉండాల్సిన అవసరం లేదంటూ గత శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేసిన..

Ajit Pawar: ముగ్గురు పిల్లలుంటే అనర్హత వేటు... అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు

ముంబై: మహారాష్ట్ర సీఎం పదవి కోసం 2024 అసెంబ్లీ ఎన్నికల వరకూ వేచి ఉండాల్సిన అవసరం లేదంటూ గత శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేసిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నేత అజిత్ పవార్.. ఈసారి ముగ్గురు పిల్లలున్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

భారతదేశం జనాభాలో చైనాను వెనక్కి నెట్టేసి 142 కోట్లకు చేరిందని, అంతకంతకూ పెరుగుతున్న జనాభా ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. ''ఒక విషయాన్ని మనమంతా సీరియస్‌గా తీసుకోవాలి. పిల్లలు భగవంతుడి అనుగ్రహంగా ఏ మతం విశ్వసించరాదు. భగవంతుడి అనుగ్రహం వల్ల పిల్లలు ఎలా పుడతారు?'' అని అజిత్ పవార్ ప్రశ్నించారు. తల్లితండ్రులకు మొదటి సంతానం కలిగి, ఆ తర్వాత రెండోసారి కాన్పులో కవలలు పుడితే, ఆ తల్లిదండ్రులను తప్పుపట్టరాదని అన్నారు.

గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ కూడా ముగ్గురు పిల్లలను ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినట్టు అజిత్ పవార్ చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం కేంద్రానికి ఉందని, ఆ అధికారం ఉపయోగించి ముగ్గురు పిల్లలున్న ఎంపీలు, ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఆయన సూచించారు.

కాగా, గత శుక్రవారం ముంబైలో జరిగిన ఎన్సీపీ కీలక సమావేశానికి గైర్హాజరైన అజిత్ పవార్ పుణెలో మీడియాతో మాట్లాడుతూ, వంద శాతం తాను సీఎం కావాలనుకుంటున్నట్టు చెప్పారు. మహారాష్ట్రలో వచ్చే ఏడాది (2024) జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల వరకు వేచి ఉండటం ఎందుకు, సీఎం పదవికి ఇప్పుడు కూడా సిద్ధమేనని ఆయన అన్నారు. అజిత్ పవార్ బీజేపీలో చేరనున్నారంటూ కొద్దికాలంగా ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో సీఎం కావాలనే ఆకాంక్షను ఆయన బహిరంగంగా వ్యక్తం చేయడం ఇటు ఎన్‌సీపీని కూడా కలవరానికి గురిచేస్తోంది.

Updated Date - 2023-04-24T14:42:26+05:30 IST