Karnataka CM: అలాగయితే ఓకేనన్న డీకే...

ABN , First Publish Date - 2023-05-17T20:41:07+05:30 IST

న్యూఢిల్లీ: కర్ణాటక సీఎం పదవిని పంచుకోవడం కుదరదని, డిప్యూటీ సీఎం తీసుకోవడం కంటే ఎమ్మెల్యేగా ఉండిపోవడం బెటరని అధిష్టానానికి తెగేసి చెప్పిన డీకే శివకుమార్ ఓ మెట్టు దిగివచ్చినట్టు ఢిల్లీ వర్గాల సమాచారం. చెరో రెండున్నరేళ్లు సిద్ధరామయ్యతో ముఖ్యమంత్రి పదవిని పంచుకునేందుకు డీకే అంగీకరించారు. అయితే ఇందుకు ఒక షరతును విధించినట్టు తెలుస్తోంది. తెలి రెండున్నరేళ్లు సీఎం పదవి తనకే ఇవ్వాలని కోరినట్టు సమాచారం.

Karnataka CM: అలాగయితే ఓకేనన్న డీకే...

న్యూఢిల్లీ: కర్ణాటక ఎన్నికల్లో గెలవడం కంటే సీఎంని ఎంపిక చేయడమే కాంగ్రెస్ అధిష్ఠానానికి తలనొప్పిగా మారిన పరిస్థితిలో మరో కీలక పరిమాణం చోటు చేసుకున్నట్టు హస్తిన వర్గాల తాజా సమాచారం. సీఎం పదవి తనకే ఇవ్వాలని, పదవిని పంచుకోవడం కుదరదని, డిప్యూటీ సీఎం తీసుకోవడం కంటే ఎమ్మెల్యేగా ఉండిపోవడం బెటరని అధిష్టానానికి తెగేసి చెప్పిన డీకే శివకుమార్ (DK Shivakumar) ఓ మెట్టు దిగివచ్చినట్టు ఢిల్లీ వర్గాల సమాచారం. చెరో రెండున్నరేళ్లు సిద్ధరామయ్యతో ముఖ్యమంత్రి పదవిని పంచుకునేందుకు డీకే అంగీకరించారు. అయితే ఇందుకు ఒక షరతును విధించినట్టు తెలుస్తోంది. తొలి రెండున్నరేళ్లు సీఎం పదవి తనకే ఇవ్వాలని ఆయన కోరినట్టు చెబుతున్నారు.

ఫుల్‌స్టాప్ ఎప్పుడంటే..?

కర్ణాటక ఫలితాలు వెలువడి నాలుగు రోజులైనా సీఎం ఎవరనేదానిపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. డీకే మంగళవారం ఢిల్లీకి చేరుకోవడం, రాహుల్ గాంధీ సైతం రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి. సాయంత్రానికి కల్లా అధిష్ఠానం నిర్ణయం ప్రకటించేస్తుందని అంతా అనుకున్నారు. డీకే, సిద్ధరామయ్య వేర్వేరుగా అధిష్ఠానం పెద్దలను కలుసుకుని తమ వాదనలు వినిపించడం, రెండు ప్రతిపాదనలు డీకే ముందుకు రావడం చకచగా జరిగిపోయాయి. సీఎం పదవి సిద్ధరామయ్యకు ఇచ్చి, డీకేకు డిప్యూటీ సీఎం, ఆరు మంత్రి పదవులతో పాటు కేపీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగిస్తామంటూ అధిష్ఠానం ఒక ప్రతిపాదన చేసింది. డిప్యూటీ సీఎంకు డీకే ససేమిరా అనడంతో ఆ ప్రతిపాదన బెడిసికొట్టింది. రెండో ప్రతిపాదనగా తొలి రెండు, రెండున్నరేళ్లు సిద్ధూకు సీఎంగా అవకాశమిచ్చి, ఆ తర్వాత డీకేను సీఎం చేస్తామనేది మరో ప్రతిపాదన. దీనిని కూడా డీకే వ్యతిరేకించారు. సీఎం సీటు వారసత్వ సంపద కాదని, పంచుకోలేమని తెగేసి చెప్పారు. సిద్ధరామయ్య అనుభవం, డీకే సామర్థ్యం బాగా తెలిసిన అధిష్ఠానం చివరివరకూ రాజీ ఫార్ములానే అనుసరించేదుకు, సంప్రదింపుల ద్వారానే పరిష్కారం కనుగొనేందుకు బుధవారం కూడా ప్రయత్నాలు సాగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో సిద్ధరామయ్యను సీఎంగా ప్రకటించనున్నారంటూ బెంగళూరులో పాలాభిషేకాలు, బాణసంచా సంబరాలు మొదలవడంతో ఇటు డీకేతో పాటు అధిష్ఠానం కూడా డిఫెన్స్‌లో పడింది. సూర్జేవాలా దిద్దుబాటు చర్యలకు దిగారు. ఇంకా ఎవరినీ సీఎంగా ఎంపిక చేయలేదని, 48 నుంచి 72 గంటల్లో కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పడం ద్వారా ఆ ఊహాగానాలకు ఒకింత ఫుల్‌స్టాప్ పెట్టారు.

డీకే వ్యూహం ఏమిటి?

కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి సర్కార్ 2019లో కూలిపోవడానికి కారణమైన ఎమ్మెల్యేల ఫిరాయింపులను సిద్ధరామయ్య ఆపలేకపోయారనేది డీకే వాదన. సిద్ధరామయ్య కాకుండా తన రాజకీయ గురువైన ఖర్గేకు సీఎం పదవి ఇస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అధిష్ఠానం ముందు ఆయన కుండబద్ధలు కొట్టారు. అయితే, తనపై కేసులు ఉన్నందునే అధిష్ఠానం బెదురుతోందని గ్రహించిన డీకే... సిద్ధరామయ్యను నేరుగా కాదనకుండా సీఎం సీటు షేరింగ్ విషయంలో మెలికి పెట్టడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారని చెబుతున్నారు. ఇక్కడ కూడా ఎక్కడా తగ్గినట్టు కనిపించకూడదని డీకే ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. తొలి రెండున్నరేళ్లు తాను సీఎం పదవిలో ఉంటే ఆ తర్వాత చూసుకోవచ్చనేది డీకే ఆలోచన కావచ్చని అంటున్నారు. ఈలోపు 2024 లోక్‌సభ ఎన్నికలు ఎలాగూ వస్తాయని, అప్పుడు సైతం పార్టీకి మెజారిటీ సీట్లు గెలిపించడం ద్వారా సిద్ధరామయ్య హవాకు పూర్తిగా గండి కొట్టవచ్చనేది ఆయన ఆలోచన కావచ్చని చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగానే ఆయన తాజాగా షరతులతో సీఎం సీటుకు అంగీకరించారని అంటున్నారు. డీకే రాజీ ఫార్ములాకు అధిష్ఠానం ఒప్పుకుంటుందా? 'మిస్టర్ క్లీన్' సిద్ధూను రేసులో వెనక్కి నెడుతుందా అనేది ఉత్కంఠ రేపుతోంది.

Updated Date - 2023-05-17T20:54:09+05:30 IST