DK Shivakumar: ఉప ముఖ్యమంత్రి ఆసక్తికర కామెంట్స్.. ఆపరేషన్ కాదు.. కో ఆపరేషన్
ABN , First Publish Date - 2023-09-09T11:54:50+05:30 IST
ఆపరేషన్ హస్త, ఆపరేషన్ కమలకు తాము పూర్తి వ్యతిరేకమని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar)
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ హస్త, ఆపరేషన్ కమలకు తాము పూర్తి వ్యతిరేకమని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) స్పష్టం చేశారు. బెంగళూరులోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని పేర్కొన్న ఆయన పరస్పర సహకారం ప్రజాస్వామ్య సుగంధాలలో ఒకటన్నారు. బీజేపీ, జేడీఎస్‌కు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్టు వస్తున్న కథనాలపై స్పందించిన ఆయన ఇతర పార్టీల నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులను పదవుల ఆశ చూపి లోబరుచుకుని, ప్రభుత్వాలను కూల్చే ప్రక్రియను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. బీజేపీ హయాంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కుప్పకూల్చడం ఫ్యాషన్‌గా మారుతోందన్నారు. ఇలాంటి వాటికి బ్రేక్ వేయాలని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలపై నమ్మకం ఉంచి ఎవరైనా సరే కాంగ్రె్‌సలో చేరేందుకు ముందుకు వస్తే వారికి స్వాగతం పలుకుతామని చెప్పారు. బీజేపీ బృందం కేఆర్‌ఎస్ డ్యామ్‌ను సందర్శించడంపై స్పందిస్తూ దీనికన్నా ఢిల్లీకి వెళ్లి మేకెదాటు ప్రాజెక్టు కోసం ప్రధానిని ఒప్పిస్తే రాష్ట్రానికి ఎంతో మేలు చేసినవారు అవుతారని తెలిపారు. కావేరి జలాల విషయంలో రాష్ట్ర రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని, ఈ విషయంలో ఎవరికీ సందేహాలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌లోకి సుకుమార్ శెట్టి..
ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఉడుపి టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే బీఎం సుకుమార్‌శెట్టి కాంగ్రె్‌సలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నేతలు కె. గోపాల్ పూజారి, శృంగేరి ఎమ్మెల్యే డి. రాజీవ్‌గౌడతో కలసి బెంగళూరులో కేపీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం తాను బీజేపీ వీడి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు శెట్టి స్వయంగా ప్రకటించారు. కాగా బెళగావి జిల్లా కాగవాడ ఎమ్మెల్యే రాజు కాగే శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి చెందిన 28 మంది ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే శాసనసభలో తమకు స్పష్టమైన మెజారిటీ ఉన్నందున తామే ఆసక్తి చూపడం లేదన్నారు.