DK Shivakumar: పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు వద్దు
ABN , First Publish Date - 2023-09-29T08:06:16+05:30 IST
పార్టీకి నష్టం కలిగించేలాంటి వ్యాఖ్యలు చేయరాదని సీనియర్‌నేత బీకే హరిప్రసాద్‌కు కేపీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(KPCC President and Deputy Chief Minister DK Shivakumar)
- హరిప్రసాద్‌కు డీకే శివకుమార్ సూచన
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): పార్టీకి నష్టం కలిగించేలాంటి వ్యాఖ్యలు చేయరాదని సీనియర్‌నేత బీకే హరిప్రసాద్‌కు కేపీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(KPCC President and Deputy Chief Minister DK Shivakumar) సూచించారు. గురువారం బీకే హరిప్రసాద్‌ను డీకే శివకుమార్ తన నివాసానికి పిలిపించుకున్నారు. సుదీర్ఘంగా చర్చలు జరిపారు. బీకే హరిప్రసాద్ ఇటీవల బీసీ వర్గాల సభలో నేరుగా సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah)ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘ముఖ్యమంత్రిని కూర్చోబెట్టడం తెలుసు.. దించడం కూడా తెలుసు’ అని వ్యాఖ్యానించారు. సీఎంను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇవే వ్యాఖ్యలు పలుమార్లు చేయడంతో పార్టీ అధిష్టానం నోటీసులు జారీ చేసింది. అప్పటి నుంచి హరిప్రసాద్ మౌనంగా ఉన్నారు. నోటీసులకు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. కాగా హరిప్రసాద్ సుదీర్ఘకాలం పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. వివిధ రాష్ట్రాలకు కీలక హోదాలలోను పార్టీ తరపున పనిచేశారు. విధానపరిషత్ ప్రతిపక్షనేతగా కొనసాగుతుండేవారు. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో మంత్రి అవుతానని భావించారు. కానీ కులసమీకరణల కారణంగా మధుబంగారప్పకు మంత్రిగిరి వరించింది. అప్పటి నుంచి హరిప్రసాద్ ప్రత్యేకించి సీఎంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధిష్టానం సూచనలను తెలిపేందుకే డీకే శివకుమార్ చర్చలకు ఆహ్వానించినట్లు తెలిసింది. మరికొన్ని నెలల్లోనే లోక్‌సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించవద్దని సూచించినట్లు సమాచారం. చర్చల సందర్భంగా పౌర ఆహార సరఫరాల శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప కూడా ఉన్నారు.