Delhi:ఢిల్లీలో ఈ కార్లు నడిపితే అంతే.. ఏకంగా రూ.20వేల జరిమానా.. ఎందుకంటే?
ABN , First Publish Date - 2023-11-04T19:26:28+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)ని వాయు కాలుష్యం పట్టి పీడిస్తోంది. ఎంతలా అంటే అక్కడి పాఠశాలలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించేంతలా! బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ట్రైనింగ్ సెషన్ రద్దు చేసుకునేలా. ఇంతటి కాలుష్య కోరల్లో చిక్కుకున్న రాజధాని ప్రజల్ని అందులోంచి బయటపడేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.
ఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీ(Delhi)ని వాయు కాలుష్యం పట్టి పీడిస్తోంది. ఎంతలా అంటే అక్కడి పాఠశాలలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించేంతలా! బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ట్రైనింగ్ సెషన్ రద్దు చేసుకునేలా. ఇంతటి కాలుష్య కోరల్లో చిక్కుకున్న రాజధాని ప్రజల్ని అందులోంచి బయటపడేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే 'రెడ్ లైట్ ఆన్.. గాడీ ఆఫ్' అనే వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా కాలుష్యం కంట్రోల్ కావట్లేదు. ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ఢిల్లీ-NCR పరిధిలో GRAP III నియమాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా BS3, BS4 ఇంజిన్‌లతో కూడిన కార్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన కచ్చితంగా అమలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించింది. ఆ వాహనాల్ని నడిపితే నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ రూ.20 వేల జరిమానా విధించనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్, డీజిల్ వాహనాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. నగరంలో క్షీణిస్తున్న వాయు నాణ్యతను పెంపొందించడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రజల ఆరోగ్య భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు, కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) ఢిల్లీ-NCR ప్రాంతంలో GRAP III నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చింది. అత్యవసర సేవలు, ప్రభుత్వ నిర్మాణ ప్రాజెక్టులు మినహా ఢిల్లీ-NCR పరిధిలోని నిర్మాణ, కూల్చివేత పనులపై నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోకి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాల ప్రవేశాన్ని నిషేధించాలని కోరుతూ ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌కు లేఖ రాశారు. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR)-ఇండియా నివేదించిన ప్రకారం, శనివారం ఉదయం ఢిల్లీలో వాయునాణ్యత మరింతగా పడిపోయి 504 పాయింట్ల వద్ద 'అతి తీవ్రమైన' కేటగిరీలో కొనసాగింది. వాయు కాలుష్యంతో నగరంలోని చాలా ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఆస్తమా, జలుబు, దగ్గు తదితర రోగాలతో పబ్లిక్ ఆసుపత్రులపాలవుతున్నారు. కట్టడి చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. నగరంలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న పెట్రోల్‌తో నడిచే వాహనాలు, దశాబ్దానికి పైగా వినియోగంలో ఉన్న డీజిల్‌తో నడిచే వాహనాల వినియోగాన్ని ఇప్పటికే నిషేధించారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం వాయు నాణ్యత సూచి 0-50 మధ్య ఉంటే "మంచిది", 51-100 "సంతృప్తికరమైనది", 101-200 "మితమైన", 201-300 "పేలవమైనది", 301-400 "చాలా పేలవమైనది", 401-500 "తీవ్రమైనది"గా పరిగణిస్తారు. 500 కంటే ఎక్కువ AQI "అతి తీవ్రమైన" విభాగంలోకి వస్తుంది.