Elections: ఉగాదికే కాంగ్రెస్ తొలి జాబితా.. 130 మంది అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లే..

ABN , First Publish Date - 2023-03-19T12:23:10+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) అభ్యర్థుల జాబితాకు ముహూర్తం కుదిరింది. కొత్త సంవత్సరం ఉగాది శుభపరిణామంగా భావించిన పార్టీ నాయ

Elections: ఉగాదికే కాంగ్రెస్ తొలి జాబితా.. 130 మంది అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లే..

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) అభ్యర్థుల జాబితాకు ముహూర్తం కుదిరింది. కొత్త సంవత్సరం ఉగాది శుభపరిణామంగా భావించిన పార్టీ నాయకులు అదే రోజున జాబితాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. సుదీర్ఘ కసరత్తు సాగించిన పార్టీ ఎట్టకేలకు తొలి జాబితాను కొలిక్కి తెచ్చింది. శుక్రవారం ఢిల్లీలో స్ర్కీనింగ్‌ కమిటీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగింది. రాహుల్‌గాంధీ సహా పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రానికి చెందిన ముఖ్యులు డీకే శివకుమార్‌, సిద్దరామయ్య, బీకే హరిప్రసాద్‌, ఎంబీ పాటిల్‌, పరమేశ్వర్‌ సహా పలువురు పాల్గొన్నారు. జిల్లాలవారీగా సమీక్ష జరిపిన స్ర్కీనింగ్‌ కమిటీ 130 మంది పేర్లకు ఆమోదం తెలిపింది. తొలి జాబితాలో ఇవే పేర్లతో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే రాజకీయంగా ఏమైనా మార్పులు జరిగితే జాబితాలో అభ్యర్థుల సంఖ్య కొంత తగ్గవచ్చునని సమాచారం. ఆరు నెలలుగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేసింది. నవంబరులో ఆశావహులు కేపీసీసీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. 224 నియోజకవర్గాలకు గాను దాదాపు 600 మంది దాకా అర్జీలు వేశారు. ఒక్కో నియోజకవర్గానికి పదిమందికి పైగా దరఖాస్తు చేసుకున్న విషయం అప్పట్లో సంచలనమైంది. అయితే వంద నియోజకవర్గాల్లో ఒక్కొక్కరు మాత్రమే అర్జీ వేశారు. వీరిలో సిట్టింగ్‌లే ఎక్కువమంది ఉన్నారు. ఒక అర్జీ రుసుం రూ.5వేలు కాగా భర్తీ చేసి కార్యాలయానికి సమర్పించే వేళ రూ.2లక్షల డీడీతో జతపరచాలనే అంశం వివాదాస్పదమయింది. ఓవైపు రాష్ట్ర నేతలు డీకే శివకుమార్‌, సిద్దరామయ్య రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరుగా సర్వేలు జరిపించారు.

తొలుత పార్టీ అధిష్టానం పలు కోణాల్లో జిల్లా వ్యాప్తంగా సమీక్షలు అత్యంత రహస్యంగా జరిపింది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికైన తర్వాత మరోసారి సర్వే సాగింది. ఇలా పలు సర్వేల తర్వాత జాబితాను రాష్ట్ర కమిటీ నిర్ధారించగా ఢిల్లీ పెద్దలకు పంపారు. తొలి జాబితాలో సిట్టింగులందరి పేర్లు ఉంటాయని తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత, ఐదేళ్లపాటు ముఖ్యమంత్రి(Chief Minister)గా వ్యవహరించి ప్రస్తుతం ప్రతిపక్షనేతగా ఉన్న సిద్దరామయ్య(Siddaramaiah) ఎక్కడ పోటీ చేస్తారనే అంశం జాబితాలో తేలిపోతుందని భావిస్తుండగా భారీమార్పులు ఉండవచ్చునని తాజాగా తెలుస్తోంది. కోలారు నుంచి పోటీ చేయనున్నట్టు సిద్దరామయ్య ప్రకటించారు. ఇందుకోసం కోలారులో రెండుసార్లు ఆయన పర్యటించారు. భారీ స్వాగతంతోపాటు స్థానికులు పోటీని సంతోషంగా భావించారు. ఆయన ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సిద్దరామయ్య పోటీ చేయాలని నిర్ణయించాక పార్టీ అధిష్టానం ఇటీవల రహస్యంగా జరిపిన సర్వేలో సానుకూలత లేదని తేలింది. ఇదే విషయాన్ని ఢిల్లీ స్ర్కీనింగ్‌ కమిటీలో రాహుల్‌గాంధీ సూచించారు. అప్పటిదాకా సిద్దరామయ్య కోలారు నుంచే పోటీ చేస్తారని తేలినా... రాహుల్‌ సూచనతో మరోసారి డోలాయమానమైంది. ప్రస్తుతం సిద్దరామయ్య బాగల్కోటె జిల్లా బాదామి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకు ముందు మైసూరు జిల్లా చాముండేశ్వరిలో వరుసగా గెలుపొందారు. 2018 ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. అంతకుముందు వరుణ నుంచి గెలుపొందారు. ప్రస్తుతం వరుణ ఎమ్మెల్యేగా సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర కొనసాగుతున్నారు. సిద్దరామయ్య రాష్ట్ర కాంగ్రెస్‏లో నెంబరు వన్‌ నాయకుడైనా ఆయన పోటీ చేసేందుకు నియోజకవర్గం ఎంపికే తీవ్ర కుతూహలంగా మారింది. కోలారు నుంచి వద్దని రాహుల్‌గాంధీ సూచించడంతో ఆయన రెండు చోట్ల పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. శనివారం బెంగళూరుకు తిరిగి వచ్చిన సిద్దరామయ్యకు ఆయన ఆప్తులైన మాజీ మంత్రి సీతారాంతోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చి కలిశారు. సిద్దరామయ్య శాసనసభలో ఉండాలని జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సిద్దరామయ్యకు కోలారు సమంజసం కాదని ఆరంభం నుంచే చెబుతున్నానన్నారు. కాగా మేలుకోటెలో దర్శన్‌ పుట్టణ్ణయ్య ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నందున కాంగ్రెస్‌ అభ్యర్థిని బరిలోకి దించరాదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2023-03-19T12:23:10+05:30 IST