Elections: దేశ చరిత్రలో తొలిసారిగా ఇంటి వద్దకే వెళ్లి..
ABN , First Publish Date - 2023-04-30T09:19:00+05:30 IST
ఎన్నికలకు సంబంధించి దేశ చరిత్రలో తొలిసారిగా ఇంటి వద్దకే వెళ్లి పోలింగ్ నిర్వహించే విధానం
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): శాసనసభ ఎన్నికలకు సంబంధించి దేశ చరిత్రలో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగుల ఇంటి వద్దకే వెళ్లి పోలింగ్ నిర్వహించే విధానం శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. మే 10న జరిగే పోలింగ్‌కు హాజరు కాలేని 80 సంవత్సరాల పైబడిన వృద్ధులు, దివ్యాంగులు తమ తమ ఇళ్ల నుంచే బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఈసారి ఎన్నికల సంఘం కల్పించిన సంగతి విదితమే. ముందస్తుగా తమ పేర్లను నమోదు చేసుకున్న వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే ఇలాంటి అవకాశం కల్పిస్తున్నారు. తొలి రోజు ఇలా దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 90 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వృద్ధులు, దివ్యాంగుల కోసం ఈ పోలింగ్ ప్రక్రియ మే 6 వరకు జరగనుందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇలా ఇంటి నుంచి ఓటు వినియోగించుకునే వృద్ధుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 80,250గానూ, దివ్యాంగుల సంఖ్య 19,279గానూ ఉందని ఎన్నికల సంఘం పేర్కొంది.