Elections: మున్నాభాయ్.. బాయ్.. రాత్రికి రాత్రే షాక్ ఇచ్చిన దళపతి
ABN , First Publish Date - 2023-04-21T08:34:16+05:30 IST
బళ్లారి జేడీఎస్ అభ్యర్థి మున్నాభాయ్(Munnabhai)కి మాజీ సీఎం కుమారస్వామి(Former CM Kumaraswamy) ఝలక్ ఇచ్చారు.
బళ్లారి(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): బళ్లారి జేడీఎస్ అభ్యర్థి మున్నాభాయ్(Munnabhai)కి మాజీ సీఎం కుమారస్వామి(Former CM Kumaraswamy) ఝలక్ ఇచ్చారు. బళ్లారి నగర అభ్యర్థిని రాత్రికి రాత్రే మార్చేశారు. పార్టీలో సీనియర్ నాయకుడు, గతంలో జేడీఎస్(JDS) అభ్యర్థిగా పోటీ చేసి.. ఇప్పటికీ పార్టీలో మున్నాబాయ్‌కి బళ్లారి నగర అభ్యర్థిగా బుధవారం సాయంత్రం పార్టీ బీ-ఫారం ఇచ్చింది. అయితే రాత్రికి రాత్రే కేవలం కొన్ని గంటలు నామినేషన్ దాఖలుకు గడువు ఉండగానే పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి జేడీఎస్‌లో చేరిన అనిల్ లాడ్‌కు సీ-ఫారం ఇచ్చి రాజకీయ కొత్తనాటకానికి తెర లేపింది. గతంలో దళపతి కుమారస్వామి పెద్ద రాజకీయ ప్రగర్భాలే పలికారు. బళ్లారి అభ్యర్థిగా పార్టీని నమ్ముకున్న కార్యకర్త మున్నాబాయ్‌కే టికెట్ ఇస్తాము. డబ్బులు ఇస్తామని ఎవరు వచ్చినా అలాంటి వారికి పార్టీ టికెట్ ఇవ్వమని మీడియా ముందు గట్టిగానే ప్రకటించారు. కానీ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అనిల్ లాడ్ చేరగానే సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్ చేపట్టిన అనేక సర్వేల్లో అనీల్ లాడ్‌కు ప్రజాభిమానం లేదని తేలడంతో పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో అనిల్ బుధవారం అర్ధరాత్రి జేడీఎస్ నాయకుడు కుమారస్వామి(Kumaraswamy) స్వామితో కలిసి పార్టీలో చేరడమే కాకుండా జేడీఎస్ టికెట్ సాధించారు. అదేరోజు సాయంత్రం బళ్లారి జేడీఎస్ అభ్యర్థిగా మున్నాబాయ్‌ను పార్టీ ప్రకటించి బీ-ఫారం కూడా ఇచ్చింది.
జేడీఎస్ అభ్యర్థిగా అనిల్ లాడ్ నామినేషన్
గురువారం నామినేషన్ వేసిన అనిల్ లాడ్ ఆక్కడ మీడియాతో మాట్లాడారు. తనకు కుమారస్వామికి మంచి స్నేహ సంబందం ఉంది. తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. తాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భరత్‌రెడ్డి ని ఓడించేందుకు పనిచేస్తాను అని ప్రకటించారు.
మున్నాభాయ్ కన్నీరు మున్నీరు
‘ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్నాను. పార్టీ టికెట్ ఇచ్చి కొన్ని గంటల్లోనే నన్ను మార్చింది. నాకు బీ- ఫారం ఇచ్చి అనిల్ అలాడ్‌కు సీ-ఫారం ఇచ్చింది. దళపతి కుమారస్వామి ఫోన్ చేసి నీతో డబ్బులు లేవు, అనీల్ లాడ్ ఖర్చు పెట్టుకుంటాడు’ అని వెల్లడించారు. ఇంత కాలం నేను పార్టీని నమ్ముకున్నందుకు వాళ్లు ఇచ్చిన బహుమతి ఇదేనా అని మున్నాభాయ్ మీడియా ముందు కన్నీరు మున్నీ రయ్యారు. మొత్తం మీద రాజకీయ హైడ్రామాలకు మరోసారి బళ్లారి వేదికగా మారింది. అయితే మున్నాభాయ్ వర్గం ఆగ్రహంతో ఉంది.