Elections: ముఖ్యమంత్రిపై పోటీకి అభ్యర్ధి ఖరారు.. ఆయన ఎవరో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-03-19T12:44:42+05:30 IST
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Chief Minister Basavaraj Bommai
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Chief Minister Basavaraj Bommai)ను కట్టడి చేసేందుకు కాంగ్రెస్ భారీ వ్యూహమే పన్నింది. ఉత్తర కర్ణాటక జిల్లాల్లో లింగాయత సామాజికవర్గం ఎక్కువ శాతం బీజేపీవైపే ఉంది. ఇక హావేరి జిల్లా శిగ్గావ్ నుంచి వరుసగా గెలుపొందుతూ బీజేపీలో అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం సీఎంగా కొనసాగుతున్న బసవరాజ్ బొమ్మైపై పోటీకి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధారవాడకు చెందిన వినయ్‌కులకర్ణిని రంగంలోకి దింపడానికి వ్యూహం రచిస్తోంది. లింగాయత సామాజిక వర్గంలోనే పంచమశాలి తెగకు చెందిన వినయ్ కులకర్ణిని శిగ్గావ్‌లో బరిలోకి నిలపాలని భావిస్తోంది. ఇందు కోసం వినయ్ కులకర్ణితో రాష్ట్ర పార్టీ ముఖ్యులు సిద్దరామయ్య, డీకే శివకుమార్(DK Sivakumar) పలుమార్లు చర్చించారు. శిగ్గావ్‌లో వినయ్ కులకర్ణిని పోటీ చేయించడం వెనుక కాంగ్రెస్ భారీ కసరత్తు చేసింది. నియోజకవర్గంలో లింగాయత సామాజికవర్గంలోని పంచమశాలి తెగకు చెందినవారు అత్యధికులు ఉన్నారు. గత మూడేళ్లుగా పంచమశాలి వర్గీయులు 2ఏ రిజర్వేషన్ కల్పించాలని పోరాటాలు చేస్తున్నారు. ప్రభుత్వం రెండుమూడుసార్లు తాత్కాలికంగా తేదీలు ఖరారు చేయడం, బుజ్జగించడం వంటి చర్యలతో పాదయాత్రలు, నిరంతర నిరాహార దీక్షలకు బ్రేక్ వేసింది. ప్రభుత్వంపై పంచమశాలి వర్గీయులు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. ఇదే తరుణంలోనే అదే తెగకు చెందిన వినయ్ కులకర్ణిని శిగ్గావ్ నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ ముఖ్యనేతలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుంది. పైగా ఎన్నికల ప్రచార సమితి అధ్యక్షుడిగా ఉండడంతో ఆయన ప్రముఖ నేతలు పాల్గొనే సభల్లోనూ భాగస్వామ్యం కావాల్సి ఉంటుంది.
ఇలా సొంత నియోజకవర్గంలో ఎక్కువ సమయం కేటాయించేందుకు వీలుండదు. వినయ్ కులకర్ణిని శిగ్గావ్‌లో పోటీ చేయిస్తే పంచమశాలి వర్గీయులను అక్కున చేర్చుకోవడం ద్వారా ఫలితం సాధించవచ్చునని భావిస్తున్నారు. శిగ్గావ్‌లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు అజ్జంపీరా ఖాద్రి, సోమణ్ణ బేవినమరద, సంజీవ్‌కుమార్ నీరలగి వంటివారు ఉన్నారు. బసవరాజ్ బొమ్మై(Basavaraj Bommai) వరుసగా మూడుసార్లు ఇక్కడి నుంచి విజయం సాధించారు. అంతకు ముందు శిగ్గావ్ నుంచి రాజశేఖర సింధూరతోపాటు ఎక్కువ మంది పంచమశాలి తెగకు చెందినవారే గెలుపొందారు. ఓసారి అజ్జంపీరా ఖాద్రి ఇక్కడి నుంచి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో మైనారిటీ వర్గానికి చెందిన అజ్జంపీరా ఖాద్రి పోటీ చేసి 74 వేల ఓట్లు సాధించారు. బొమ్మైకు 83వేల ఓట్లు రావడంతో 9వేల మెజారిటీతో గెలుపొందారు. బసవరాజ్ బొమ్మై(Basavaraj Bommai) గతంలోనూ యడియూరప్ప కేబినెట్‌లో కీలకమంత్రిగానే వ్యవహరించారు. అక్కడ కాంగ్రెస్ కూడా బలంగా ఉందనేందుకు 74వేల ఓట్లు ఖాద్రికి దక్కడమే నిదర్శనం. వినయ్ కులకర్ణి ధారవాడ నుంచి గెలుపొందుతూ వచ్చారు. గత ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. అయితే జడ్పీటీసీ సభ్యుడి హత్య కేసులో ఆయన నిందితుడిగా ఉన్న మేరకు ధారవాడలో నిషేధం విధించారు. ధారవాడకు వెళ్లేందుకు వీలులేకపోవడం పంచమశాలిలో ప్రముఖనేతగా ఉండడంతో వినయ్ కులకర్ణినిని పోటీ చేయించదలిచారు. స్ర్కీనింగ్ కమిటీలోనూ సుదీర్ఘ చర్చ తర్వాత అధిష్టానం ఆయన పేరును ఖరారు చేసింది.