Electricity bill: మీ కరెంటు బిల్లు రూ.1000 దాటుతోందా.. ఇకపై మీరు ఏ విధంగా చెల్లించాలంటే..
ABN , First Publish Date - 2023-05-03T09:16:55+05:30 IST
రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి విద్యుత్ బిల్లులను(Electricity bills) సులభతరంగా చెల్లించే పద్ధతులను అమలు చేయడంలో భాగంగా
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి విద్యుత్ బిల్లులను(Electricity bills) సులభతరంగా చెల్లించే పద్ధతులను అమలు చేయడంలో భాగంగా ఇకపై కరెంట్ ఛార్జీలు రూ.1000 దాటితే గృహోపయోగదారులు, సంస్థల నిర్వాహకులు ఆన్‌లైన్‌లో చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ విద్యుత్ ఛార్జీలు రూ. 5 వేలు దాటితే ఆన్‌లైన్(Online)లోనూ, చెక్కులు, డిమాండ్ డ్రాఫ్టు రూపంలోనూ చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు నెలల కరెంట్ బిల్లులు (లేదా 372 యూనిట్లు దాటితే) రూ.1000 దాటితే ఆ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించే పద్ధతిని అమలు చేయాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ప్రతిపాదించింది. ఆ మండలి ఇటీవల విద్యుత్ బోర్డులో పలు మార్పులను సిఫారసు చేసింది. అవి అమల్లోకి వస్తే రూ.1000కు పైగా విద్యుత్ ఛార్జీలను ఆన్‌లైన్‌లో లేదా చెక్కు, డిమాండ్ ట్రాఫ్టుల రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది.
రాష్ట్ర విద్యుత్ బోర్డు(State Electricity Board) తన మొత్తం ఆదాయంలతో 74 శాతాన్ని డిజిటల్ పద్ధతిలోనే సేకరిస్తోంది. ఇదిలా ఉండగా విద్యుత్ ఛార్జీలను వసూలు చేసే కౌంటర్ల సంఖ్యను తగ్గించేందుకే విద్యుత్ నియంత్రణ మండలి ఈ ప్రతిపాదనను చేస్తోందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. కాగా రూ.5వేలకు పైగా విద్యుత్ ఛార్జీలను ఆన్‌లైన్(Online), చెక్కులు, డిమాండ్ డ్రాఫ్టుల రూపంలో వసూలు చేయాల్సి ఉండగా ప్రస్తుతం రూ.2 వేలకు పైబడిన విద్యుత్ బిల్లులను వసూలు చేయకూడదంటూ బిల్లు కౌంటర్ల సిబ్బందికి అధికారులు మౌఖిక ఉత్తర్వులు జారీ చేశారని, దీనితో విద్యుత్ వినియోగదారులు ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితులలో రూ.1000కి పైబడిన విద్యుత్ బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించమనడం గర్హనీయమని కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు.