Enforcement Directorate : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌కు ఈడీ సమన్లు!
ABN , First Publish Date - 2023-08-19T14:10:59+05:30 IST
మనీలాండరింగ్ కేసులో దర్యాప్తునకు హాజరుకావాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. ఈ నెల 24న హాజరుకావాలని ఆదేశించింది.
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో దర్యాప్తునకు హాజరుకావాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ (Jharkhand chief minister Hemant Soren)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. ఈ నెల 24న హాజరుకావాలని ఆదేశించింది. ఈడీ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా శనివారం ఈ వివరాలను తెలిపింది.
భూ కుంభకోణం కేసులో దర్యాప్తునకు ఈ నెల 14న హాజరుకావాలని అంతకుముందు ఈడీ సొరేన్‌కు సమన్లు జారీ చేసింది. కానీ ఆయన హాజరుకాలేదు. స్వాతంత్ర్య దినోత్సవాల కోసం తీరిక లేకుండా పని చేస్తున్నానని, అందువల్ల తాను దర్యాప్తునకు హాజరుకాలేనని ఈడీకి సమాచారం ఇచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవాలకు ముందు రోజున రావాలని తనను పిలవడం తనను ఆశ్చర్యపరచలేదన్నారు. ‘‘మీకు, మీ రాజకీయ యజమానులకు తెలుసు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో తీరిక లేకుండా పని చేస్తున్నానని’’ అని దుయ్యబట్టారు. తాను కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా లేనందువల్లే తనను కేంద్ర దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయని ఆరోపించారు.
సాహెబ్ గంజ్‌లో చట్టవిరుద్ధంగా గనులను తవ్వినందుకు కేసు నమోదైంది. దాదాపు రూ.1,000 కోట్లు విలువైన గనులను అక్రమంగా తవ్వినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసులో గత ఏడాది నవంబరులో సొరేన్‌ను ఈడీ ప్రశ్నించింది. ఆయన సన్నిహితుడు పంకజ్ మిశ్రాను అరెస్ట్ చేసింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు పక్కదారి పట్టినట్లు నమోదైన కేసులో కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఇవి కూడా చదవండి :
Udyan Express : ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం..
Evil Nurse : ఏడుగురు పసికందులను చంపేసిన నర్స్.. భారత సంతతి డాక్టర్ కృషితో ఆ రాక్షసికి శిక్ష..