BS Eshawarappa: సీఎం వ్యాఖ్యలపై ఈశ్వరప్ప యూ టర్న్..!

ABN , First Publish Date - 2023-04-26T13:37:59+05:30 IST

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి ముఖ్యమంత్రి అవుతారంటూ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత..

BS Eshawarappa: సీఎం వ్యాఖ్యలపై ఈశ్వరప్ప యూ టర్న్..!

బెంగళూరు: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి (CT Ravi) కర్ణాటక ముఖ్యమంత్రి అవుతారంటూ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప (KS Eshwarppa) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో ఈశ్వరప్ప వెంటనే వివరణ ఇచ్చారు. తాను అలాంటి వ్యాఖ్యలు ఏమీ చేయలేదన్నారు. రవి 'మంచి నేత' అని, అయితే సీఎం అభ్యర్థి ఎవరో నిర్ణయించడం తన పరిధిలో లేదని తెలిపారు. ప్రత్యక్ష ఎన్నికలకు తాను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఇటీవల ఈశ్వరప్ప ప్రకటించారు.

కాగా, చిక్కమగళూరు సమీపంలోని నిడుఘట్టలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈశ్వరప్ప ఇటీవల పాల్గొన్నారు. సీటీ రవి భారీ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి అవుతారని ఆశిస్తున్నట్టుగా ఆయన పేర్కొన్నారని వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షను సీటీ రవి వ్యక్తం చేసిన మరుసటి రోజే ఈశ్వరప్ప ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆ అధికారం లేదు...

కాగా, సీటీ రవి భవిష్యత్ సీఎం అని పేర్కొనడంపై మీడియా ప్రశ్నించినప్పుడు, అలాంటి వ్యాఖ్యలేమీ తాను చేయలేదన్నారు. ''సీటీ రవి మంచి నాయకుడు. చిక్కమగళూరుకు చాలా మంచి చేశారు. అయితే ఆయన సీఎం అవుతారని నేను చెప్పలేదు. అలాంటి ప్రకటన చేసే అధికారం కూడా నాకు లేదు'' అని ఈశ్వరప్ప వివరణ ఇచ్చారు. అయితే, వొక్కలిగ సామాజిక వర్గంలో ప్రముఖ నాయకుడైన రవికి భవిష్యత్ సీఎం అయ్యే అన్ని అర్హతులు ఉన్నాయని చెప్పారు.

దీనికి ముందు, శివమొగ్గలో సోమవారంనాడు జరిగిన వీరశైవ-లింగాయత్ సమావేశంలో కూడా ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఒక్క ముస్లిం ఓటు కూడా అక్కర్లేదని అన్నారు. జాతీయవాద ముస్లింలు ఎలాగూ బీజేపీకి ఓటు వేస్తారని వ్యాఖ్యానించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరుగనుండగా, మే 13న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2023-04-26T13:43:35+05:30 IST