Navjot Singh Sidhu: సర్దార్ వస్తున్నాడు... సిద్ధూ ట్వీట్
ABN , First Publish Date - 2023-03-31T15:22:59+05:30 IST
పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఏప్రిల్ 1వ తేదీ శనివారం పాటియాలా జైలు నుంచి
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) ఏప్రిల్ 1వ తేదీ శనివారం పాటియాలా జైలు నుంచి విడుదల కానున్నారు. తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని సిద్ధూ నిర్ధారించారు. ''సర్దార్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ రేపు (ఏప్రిల్ 1) పాటియాలా జైలు నుంచి విడుదల అవుతున్నాడు'' అని ఆయన ట్వీట్ చేశారు. 1988లో పాటియాలాలో జరిగిన రోడ్ రేజ్ డెత్ కేసులో సుప్రీంకోర్టు గత ఏడాది ఆయనకు సంవత్సరం పాటు జైలు శిక్ష విధించడంతో ఆయన వెంటనే చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు లొంగిపాయారు. అనంతరం ఆయనను పాటియాలా జైలుకు తరలించారు.
కేసు వివరాలు...
1988లో పాటియాలాలో కారు పార్కింగ్ విషయంలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తితో సిద్ధూ, అతడి అనుచరుడు రూపీందర్ సింగ్ సంధు గొడవ పడి తీవ్రంగా గాయపరిచారు. తీవ్ర గాయలపాలైన గుర్నామ్ సింగ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో గుర్నామ్ సింగ్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 1999లో ఈ కేసును విచారించిన పాటియాలా సెషన్స్ కోర్టు, ఎలాంటి సాక్ష్యాలు లేవంటూ సిద్ధూ, అతడి అనుచరుడిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే ఈ తీర్పును గుర్నామ్ సింగ్ కుటుంబ సభ్యులు పంజాబ్, హర్యానా హైకోర్టులో సవాల్ చేశారు. 2006లో ఈ కేసును విచారించిన హైకోర్టు ధర్మాసనం సిద్ధూకు మూడేళ్ల జైలు శిక్షవిధిస్తూ తీర్పు చెప్పింది. దీనిపై సుప్రీంకోర్టును సిద్ధూ ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ఆయనకు ఏడాది జైలు శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది. తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసుకునే వెసులుబాటును సిద్ధూకు కల్పించింది. అయితే, ఆయన నేరుగా మేజిస్ట్రేట్ కోర్టు ముందు లొంగిపోయారు. శిక్షాకాలం పూర్తి కావడంతో విడుదలకు మార్గం సుగమమైంది.