Share News

Delhi Excise case: సంజయ్ సింగ్ కస్టడీ పొడిగింపు, ప్రైవేటు వైద్యానికి అనుమతి

ABN , First Publish Date - 2023-10-27T18:30:12+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పార్లమెంటు సభ్యుడు సంజయ్ సింగ్ జ్యుడిషియల్ కస్టడీని నవంబర్ 10వ తేదీ వరకూ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారంనాడు పొడిగించింది. లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇటీవల ఆయనను అరెస్టు చేసింది.

Delhi Excise case: సంజయ్ సింగ్ కస్టడీ పొడిగింపు, ప్రైవేటు వైద్యానికి అనుమతి

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, పార్లమెంటు సభ్యుడు సంజయ్ సింగ్ (Sanjay Singh) జ్యుడిషియల్ కస్టడీని నవంబర్ 10వ తేదీ వరకూ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారంనాడు పొడిగించింది. లిక్కర్ కుంభకోణం కేసు (Liquor scam case)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇటీవల ఆయనను అరెస్టు చేసింది.


రెగ్యులర్ వైద్య చికిత్స కోసం తన ప్రైవేటు వైద్యుడిని అనుమతిస్తూ జైలు అధికారులకు ఆదేశాలివ్వాలని కోర్టును సంజయ్ సింగ్ ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ, వైద్య చికిత్సకు ఆయన అర్హులే అయినప్పటికీ జైలులో ఇది సాధ్యం కాదని, అందువల్ల ఆయన కంటి వైద్య నిపుణుడిని సంప్రదించవచ్చని తెలిపింది. ప్రైవేటు వైద్యచికిత్సకు అనుమతించే విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం కనిపించడం లేదని స్పష్టం చేసింది. వైద్య చికిత్స సమయంలో ఆయన మద్దతుదారులను అనుమతించ వద్దని, చికిత్స కోసం వచ్చే పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కోర్టు ఆదేశించింది. కుటుంబ అవసరాల నిమిత్తం రెండు చెక్కులపై ఆయన సంతకాలు చేసేందుకు,నిధుల బదలాయింపునకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్‌రు అడ్రస్ చేస్తూ రెండు లేఖలో సంతకాలు చేసేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది.


ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తనను అరెస్టు చేయడాన్ని, ట్రయిల్ కోర్టు ఇచ్చిన రిమాండ్‌ను సవాలు చేస్తూ సంజయ్ సింగ్ ఇటీవల దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. లిక్కర్ కేసులో ఢిల్లీలోని ఆయన నివాసంలో రోజంతా విచారణ జరిపిన ఈడీ గత అక్టోబర్ 4న సంజయ్ సింగ్‌ను అరెస్టు చేసింది. 2020లో ఆల్కహాల్ దుకాణాలు, మర్చెంట్లకు లైసెన్సుల మంజురు నిర్ణయంలో సింగ్, ఆయన సన్నిహితుల పాత్ర ఉందని ఈడీ ఆరోపిస్తోంది.

Updated Date - 2023-10-27T18:30:12+05:30 IST